కర్ణాటక రాష్ట్రం కలబురిగి బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారాన్ని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పార్థీవదేహాలను వారి స్వస్థలానికి తరలించడం.. క్షతగాత్రులకు వైద్య సాయం అందించడం వంటి చర్యలు చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కర్ణాటక బస్సు ప్రమాదంల దురదృష్టకరమని అన్నారు. ప్రస్తుతం 16 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారని.. కొందర్ని హైదరాబాద్ నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తామని తలసాని అన్నారు. కర్ణాటక అధికారులతో సీఎం కేసీఆర్, సీఎస్ మాట్లాడారని వెల్లడించారు. బాధిత కుటుంబాలు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఉన్నారని..వారి కుటుంబాలను ప్రభుత్వం తరపున పరామర్శిస్తామని ఆయన వెల్లడించారు.
శుక్రవారం ఉదయం కలబురిగి జిల్లా కమలాపురలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కంటైనర్ ట్రక్కును బస్సు ఢీ కొట్టడంతో బస్సుల ప్రయాణిస్తున్న 32 మందిలో నలుగురు సజీవ దహనం కాగా.. మరో నలుగురు ఆసుపత్రికి తరలించే క్రమంలో మొత్తంగా 8 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు.
