జనగామ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగామ జిల్లా ఒకప్పుడు కరువుసీమగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని ఆయన అన్నారు. వచ్చే ఏడాదిలోగా అన్ని చెరువులు నింపుతామని, అలాగే జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ఆయన అన్నారు. పాలకుర్తిలో కూడా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు అందించనున్నామని, మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలకు దళిత బంధు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
నేను చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడనని, అవన్నీ మీ కంటిముందే ఉన్నాయని ఆయన అన్నారు. అయితే కొన్ని సమస్యలు దేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వ సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. సమైక్యాంధ్ర పాలనతో ఎంతో నష్టపోయిన తెలంగాణ ప్రజలు, స్వరాష్ట్రంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు ప్రవేశపెట్టామని, ఎలాంటి దరఖాస్తు లేకుండానే హైదరాబాద్‌లో సర్కార్ విడుదల చేస్తే బ్యాంకులో డబ్బులు జమవుతున్నాయని ఆయన అన్నారు.