Christmas Celebrations Medak Church: మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెదక్ కేథడ్రల్ క్రిస్మస్ వేడుకలు మిన్నంటాయి. క్రిస్మస్ వేకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై, గిరిజన అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డితో కలిసి చర్చి లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని క్రిస్మస్ వేడుకలకు చర్చ్ కు వచ్చే భక్తులు మాస్క్‌లు ధరించి హాజరయ్యారు. చర్చి లోపల ప్రేయర్ హాల్ భక్తులతో నిండిపోయింది. చర్చ్ బయటనే ప్రార్థనలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్‌ఐ) మెదక్ డియోసెస్ పరిధిలోని 13 జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు మెదక్ చర్చికి తరలివచ్చారు. ఈ మేరకు చర్చి పాస్టోరేట్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రధాన టవర్, తోరణాలు, ప్రాంగణం, చర్చి లోపలి భాగాన్ని రంగురంగులగా అలంకరించారు. క్రీస్తు జన్మదిన విశేషాలను తెలిపేందుకు పెద్ద సైజు క్రిస్మస్ చెట్టు, పశువుల కొట్టం ఏర్పాటు చేశారు.
Read also: Traffic Diversions: రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి.. 26 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
ఇవాళ తెల్లవారుజామున 4:30 గంటలకు చర్చిలో తొలి సేవతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. సిఎస్‌ఐ మెదక్ డయాసిస్ బిషప్ మోస్ట్ రెవరెండ్ ఎసి సాల్మన్ రాజ్ భక్తులనుద్దేశించి మాట్లాడారు. ఉదయం 9.30 గంటలకు రెండో సేవ అనంతరం భక్తులను చర్చికి అనుమతించారు. మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం బాలానగర్, ఎల్లారెడ్డి, చేగుంట, బొడ్మట్‌పల్లి రూట్ల నుంచి అదనపు బస్సులను ఆర్టీసీ మెదక్ డిపో మేనేజర్ రవిచంద్ర ఏర్పాటు చేశారు. సంగారెడ్డి డిపో నుంచి కూడా చాలా బస్సులు బయలుదేరుతాయి. మెదక్ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. మెదక్ చర్చిలో దర్శనానికి, ప్రార్థనలకు లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్, వాహనాల పార్కింగ్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకున్నారు.
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్