అధికారం, హోదా వున్నా కొందరు సమాజం గురించి ఆలోచిస్తుంటారు. రోడ్డు మీద వెళుతుంటే.. ఎవరికైనా ఏమైనా అయితే కొందరు అంతగా పట్టించుకోరు. అదే యాక్సిడెంట్ కేసయితే మనకెందుకులే.. పోలీసులు మళ్ళీ విసిగిస్తారని తమ దారిన తాము పోతారు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు రోడ్డు మీద ఎవరికైనా ఏమైనా జరిగితే వెంటనే స్పందిస్తారు. మానవత్వం చాటుకుంటారు. తాజాగా మరోసారి మానవత్వం చాటుకున్నారు చేవెళ్ళ ఎంపీ డా.జి.రంజిత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు ఘటనలో గాయపడ్డ బాధితుడిని తన వాహనంలో సమీపంలోని దవాఖానాకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
తక్షణం మంచి వైద్యం అందించాలని డాక్టర్లకు ఫోన్ ద్వారా ఆదేశించిన చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. ఈ రోజు వరంగల్ లో వివాహ కార్యక్రమంలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఔటర్ రింగ్ రోడ్డుపై వెళుతున్నారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. ఆయన ఓఆర్ఆర్ పై ప్రయాణిస్తుండగా ప్రమాదంలో గాయపడి ఒక వ్యక్తి రక్తం మరకలతో కనబడ్డారు. ఆ వ్యక్తిని చూసిన వెంటనే తన కారు ఆపి వారి వద్దకు వెళ్ళి ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీశారు ఎంపీ రంజిత్ రెడ్డి. తక్షణం స్పందించారు. వెంటనే తన వాహనంలో బాధితుడిని కర్మాన్ ఘాట్ గ్లోబల్ అవేర్ దవాఖానాకి పంపించి మంచి వైద్యం అందించాలని అక్కడి డాక్టర్లను ఫోన్ ద్వారా ఆదేశించారు. ఎంపీగా గతంలోనూ అనేక మార్లు సామాజిక సేవలో రంజిత్ రెడ్డి పాల్గోని అందరికీ ఆదర్శంగా నిలిచారు. తాజాగా ఎంపీ స్పందించిన తీరుపై జనం బాగా స్పందిస్తున్నారు. మాట్లాడే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అని ప్రశంసిస్తున్నారు.
