NTV Telugu Site icon

Anantgiri Hills: ఎంజాయ్‌ చేసుకోమంటే రేసింగ్.. అనంతగిరి కొండల్లో కార్లు, బైకులతో రచ్చ..!

Anatagiri Hils

Anatagiri Hils

Anantgiri Hills: హైదరాబాద్ నగరంతో పాటు శివార్లలో కూడా బడాబాబులు పిల్లలు కార్ రేసింగ్‌లతో రెచ్చిపోతున్నారు. బ్రాండెడ్ కార్లు, బైక్ లతో సందడి చేస్తున్నారు. మితిమీరిన వేగంతో పరుగెత్తుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా నగరంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఇద్దరు మహిళలు బైక్ రేసర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రేసింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు ప్రకృతి అందాలకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయమైన వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో బైక్‌లు, కార్లతో రేసింగ్‌లు చేస్తూ కలకలం సృష్టించారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనంతగిరి వ్యూ పాయింట్ల దగ్గర రేసింగ్ నిర్వహించి పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రశాంతంగా ఉన్న అనంతగిరి కొండల్లో కార్లు, బైకులతో విన్యాసాలు దుమ్ము లేపారు. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు.

Read also: KCR Medak Tour: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. వరుణుడే కారణం..!

అనంతగిరి కొండలపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓఎస్‌ఐ, సిబ్బంది పహారా కాస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో వారు కూడా గైర్హాజరు కావడంతో అబ్బాయిలు మరింత రెచ్చిపోయారు. బైక్‌లు, కార్లను విడివిడిగా నడుపుతూ హంగామా చేశారు. పదుల సంఖ్యలో అక్కడికి చేరుకున్న యువకులు రేసింగ్‌లు ప్రారంభించారు. ఆనందకరమైన అనంతగిరి కొండలలో రేసింగ్‌లకు అనుమతి లేదు. కానీ కొందరు అటవీ శాఖ సిబ్బంది కొండపైకి అనుమతించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనంతగిరి కొండల్లోని ప్రశాంత వాతావరణం ఇలాంటి రేసింగ్ వల్ల దెబ్బతినకుండా పోలీసులు, అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. వారందరూ తాగి బైక్, కార్లు రేసింగ్ తో ప్రశాంత వాతావరణాన్ని దుమ్మురేపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటివ వారికి అనంతగిరి కొండలపై అనుమతించకూడదని, ప్రతి ఒక్కరికి తనిఖీలు నిర్వహించి అనుమతించాలని కోరుతున్నారు. ఇలాంటి బడాబాబుల పిల్లల వల్ల అక్కడకు వచ్చే పర్యాటకులు చాలా ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుందని మండిపడుతున్నారు.
KCR Medak Tour: సీఎం కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. వరుణుడే కారణం..!