పదేళ్లలో తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశంలో నెంబర్ వన్‌గా నిలిపామని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డీ నొక్కి చెప్పారు. ఆరవ రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా విద్యుత్‌పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యుత్ బకాయిలు, కరెంట్ సరఫరాపై అధికార పార్టీ చేసిన విమర్శలకు, ప్రశ్నలకు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ధీటూగా స్పందించారు. దేశంలో 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమెట్ ఇండెక్స్‌లో ప్రకటించిందని గుర్తు చేశారు. శాసన సభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని ఆయన వివరించారు.
యూపీఏ ప్రభుత్వం నిర్ణయాల వల్ల అంతా మంచి జరిగితే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా కరెంటు సరఫరా బాగా జరగాలని కోరుకుంటున్నామన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, విద్యుత్ పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఉన్న మాట వాస్తవమే.. అలాగే ఆస్తులు ఉన్న మాట కూడా వాస్తవమన్నారు. అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందా? అని ప్రశ్నించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఉచిత విద్యుత్, 200 యూనిట్‌ల ఫ్రీ కరెంట్ ఎప్పటినుంచి ఇస్తారు చెప్పాలని కోరుతున్నానని పేర్కొన్నారు. విద్యుత్ ధరల భారాన్ని ప్రజలపై మోపకుండా ఉంటారా? ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు.