Site icon NTV Telugu

BRS : ఈనెల 19న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

Kcr Speech

Kcr Speech

BRS : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన ఈ నెల 19న పార్టీకి చెందిన కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ఎస్‌ ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజా ఉద్యమాలు, పార్టీ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రత్యేకంగా కృష్ణా-గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరగనుంది. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రారంభించి నిర్మాణం చేపట్టిన కీలక సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న జలదోపిడిని అడ్డుకోవడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు.

తెలంగాణ రైతాంగానికి సాగునీటి హక్కులు కాపాడేందుకు మరో ప్రజా ఉద్యమం తప్పదని కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాబోయే రోజుల్లో చేపట్టే ఉద్యమాల రూపురేఖలపై ఈ విస్తృతస్థాయి సమావేశంలో లోతైన చర్చ జరగనుంది. ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేటాయించాల్సిన నీటిని 90 టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు తగ్గించడంపై బీఆర్‌ఎస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

45 టీఎంసీలకు అంగీకరించి కేంద్ర ప్రభుత్వానికి తలవంచడం రైతాంగ ప్రయోజనాలకు ఘోరమైన ద్రోహమని బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శిస్తున్నారు. పాలమూరు రెండో దశ పనులు ఎలా పూర్తవుతాయో చెప్పాలని కేసీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరి తెలంగాణకు తీవ్రమైన అన్యాయమని ఆయన ఆరోపించినట్లు సమాచారం.

ఇదే సందర్భంలో కేంద్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రయోజనాలపై ఒక్కరూ మాట్లాడటం లేదని కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు బీజేపీ కూడా గండి కొడుతోందని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. కేంద్రం చేస్తున్న సాగునీటి అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే ప్రత్యక్ష ప్రజా పోరాటాలే మార్గమని కేసీఆర్‌ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొనసాగి ఉంటే పాలమూరు నుంచే ఇప్పటికే నీళ్లు వచ్చేవని కేసీఆర్‌ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. రెండేళ్లు గడిచినా రైతాంగ ప్రయోజనాలపై మౌనం వీడాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

సాగునీటి హక్కుల విషయంలో బీఆర్‌ఎస్‌ ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. ఈ నెల 19న జరగనున్న సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, జల కేటాయింపులపై ఉద్యమానికి శ్రీకారం చుట్టే నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌ జలదోపిడిపై పోరాటానికి బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోందని పేర్కొన్నారు.

John Cena: రిటైర్మెంట్ మ్యాచ్‌లో ఓడిపోయిన జాన్‌సీనా.. ఓడించింది ఇతనే!

Exit mobile version