Site icon NTV Telugu

Boora Narsaiah Goud Quit TRS: టీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్‌..?

Boora Narsaiah Goud

Boora Narsaiah Goud

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలినట్టు అయ్యింది… టీఆర్ఎస్‌ కీలకంగా భావిస్తున్న మునుగోడు బైపోల్‌ సమయంలో గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు మాజీ ఎంపీ, టీఆర్ఎస్‌ సీనియర్‌ నేత బూర నర్సయ్యగౌడ్.. మునుగోడు ఉప ఎన్నికలో నిన్న టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన.. ఇవాళ ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు.. భారతీయ జనతా పార్టీలో చేరడానికే ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు.

Read Also: Intermediate Board: ఇంటర్‌లో మళ్లీ పాత పద్దతి.. వంద శాతం సిలబస్..

కాగా, 2014 ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన.. 2019ల్లో మరోసారి పోటీ చేసినా.. కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో.. ఆయన పేరు తెరపైకి వచ్చింది.. మునుగోడు టీఆర్ఎస్‌ టికెట్‌ను ఆశించారు బూర నర్సయ్యగౌడ్‌.. కానీ, ఆయనకు నిరాశ తప్పలేదు.. ప్రగతి భవన్‌కు పిలిపుంచుకుని మాట్లాడిన సీఎం కేసీఆర్‌… బీఆర్‌ఎస్‌లో మీ పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పినట్టుగా.. ఆ తర్వాత మీడియాకు బూర నర్సయ్య గౌడ్‌ చెప్పిన విషయం తెలిసిందే.. అంతేకాదు.. అధినేత కేసీఆర్‌ మాటకు కట్టుబడి ఉంటామని.. మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామన్నారు. కానీ, ఉన్నట్టుండి.. కారు పార్టీకి షాక్‌ ఇచ్చారు బూర.. ఇక, నిన్న రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి తరుణ్ చుగ్‌ను భేటీ అయ్యారు బూర నర్సయ్య గౌడ్.. ఢిల్లీ వెళ్లిన ఆయన.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నట్టు తెలుస్తోంది.. అక్కడే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం కూడా సాగుతోంది.

అయితే, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్నందున.. బీసీ అభ్యర్థికే టికెట్‌ ఇవ్వాలని బహిరంగంగానే చెబుతూ వచ్చారు బూర నర్సయ్యగౌడ్.. మంత్రి జగదీష్‌రెడ్డి వ్యవహారాన్ని తప్పుబడుతూ వచ్చిన ఆయన.. పార్టీ లైన్‌ను మాత్రం ఎక్కడగా దాటలేదు.. చివరకు టికెట్‌ విషయంలోనూ పార్టీ అధినేత మాటకే కట్టుబడి ఉన్నానని ప్రకటించారు.. కానీ, ఉన్నట్టుండి.. కారు దిగేశారు.. కమలం తీర్థం పుచ్చుకోవడమే మిగిలిందని తెలుస్తుంది. కాగా, తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన బీజేపీ.. ఇతర పార్టీలో కీలకంగా ఉన్న నేతలను, మాజీ ప్రజాప్రతినిధులను.. అసంతృప్తితో ఉన్నవారిని లాగే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version