Site icon NTV Telugu

Premender Reddy: మునోగొడుపై ప్రభావం చూపే విధంగా సభ నిర్వహిస్తాం

Premender Reddy On Bjp Meet

Premender Reddy On Bjp Meet

BJP Leader Premender Reddy On Amberpet Public Meeting: పార్లమెంట్ ప్రవాస్ యోజన‌లో భాగంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి చేవెళ్ల పర్యటిస్తారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. అంతేకాదు.. ఈ నెల 23,24 తేదీల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో బీఎల్ వర్మ సైతం పర్యటించనున్నారని పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా వాళ్లు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులను కలుస్తారని.. కేంద్ర ప్రభుత్వ నిధుల ఖర్చు, పథకాల అమలు తీరును పరిశీలిస్తారన్నారు. ఈ సందర్భంగానే బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అవుతారన్నారు.

ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తయ్యిందని పేర్కొన్న ప్రేమేందర్ రెడ్డి.. రెండో విడత 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రారంభమైనట్లు వెల్లడించారు. బైక్ ర్యాలీలకు మంచి స్పందన వస్తోందని, ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఎంతుందో స్పష్టమవుతోందని చెప్పారు. ప్రధాని మోడీ పుట్టినరోజుని పురస్కరించుకొని.. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు ‘సేవా పక్షోత్సవం’ నిర్హిస్తున్నామని, ఇందులో అనేక కార్యక్రమాల్ని చేపట్టనున్నామని అన్నారు. 10 వేల మంది రక్తదాతలతో బ్లడ్ డైరెక్టరీ తయారు చేస్తున్నామని, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్, ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు.

అలాగే.. ఈ నెల 25వ తేదీన దీన దయాళ్ జయంతి సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నామని ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్, వోకల్ 2 లోకల్ కార్యక్రమాలూ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. టీబీ ముక్త భారత్‌లో భాగంగా ఒక్కో టీబీ పేషెంట్‌కు బీజేపీ కార్యకర్తలు వాలెంటర్‌గా ఉంటారన్నారు. ఇక బండి సంజయ్ సంగ్రామ యాత్ర నాలుగో విడత రేపటితో ముగియనున్న సందర్భంలో.. అంబర్‌పేటలో భారీఎత్తున సభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారని, మునోగొడుపై చూపే విధంగా ఈ సభ నిర్వహిస్తామని క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version