NTV Telugu Site icon

BJP: ఈటెల సమక్షంలో బీజేపీలో చేరిన సినీ నటుడు

Sanjai Raichura

Sanjai Raichura

Actor Sanjay Raichura joined BJP: తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని అనుకుంటోంది. దీనికి తగ్గట్లుగానే తన కార్యాచరణను అమలు చేస్తోంది. బీజేపీలోకి ఇతర నాయకులను చేర్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించి కేంద్ర హోమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఇక వరంగల్ టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా బీజేపీ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. రానున్న మరికొన్ని రోజుల్లో పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Read Also: Telangana Voice: గెలిచిన తెలంగాణ వాదన. వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం

తాజాగా సినీ నటుడు సంజయ్ రాయిచుర బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే రాజేందర్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈటెల కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఆచార్య, మహర్షి వంటి సినిమాల్లో నటించారు సంజయ్ రాయిచర. దీంతో పాటు పలు దక్షిణ భారత సినిమాల్లో, సీరియళ్లలో నటించారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి విజన్, సమర్థవంతమైన నాయకత్వ లక్షణాల పట్ల ఆకర్షితమై బీజేపీలో చేరుతున్నానని సంజయ్ అన్నారు. సంజయ్ చేరిక బీజేపీని మరింత బలోపేతం చేస్తుందని ఈటెల అన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు.