Site icon NTV Telugu

Basara IIIT: ఉద్రిక్తత.. క్యాంపస్ వైపు దూసుకొచ్చిన BJP కార్యకర్తలు..!

Iiit

Iiit

బాసర ట్రిపుల్ ఐటి క్యాంపస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు క్యాంపస్‌‌లోకి దూసుకు రావడంతో.. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. క్యాంపస్ లోనికి అనుమతించకపోవడంతో.. క్యాంపస్ ఎదుట బీజేపీ నేతల ధర్నాకు దిగారు. క్యాంపస్‌లోకి ఎవరినీ రానీయకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ నేతలు దూసుకురావడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీకీ వస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను బిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అరెస్టు చేశారు. తాను బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతు తెలపడానికి, సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్నానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. బండి సంజయ్‌ను పోలీసు వాహనంలో ఎక్కించారు.

దీంతో బీజేపీ కార్యకర్తలు, మహిళలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. కాన్వాయి ముందు ఉన్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు… సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

Exit mobile version