తెలంగాణ టీఆర్‌ఎస్ లో విభేదాలు ముదురుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒంటెత్తు పోకడలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భీమారం మండలానికి చెందిన కీలక నేత చెరుకు సరోత్తంరెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కొద్ది రోజుల్లో జిల్లా స్థాయిలో 20 వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజీనామాలు ప్రకటిస్తామని చెరుకు సరోత్తంరెడ్డి ప్రకటించారు. నిన్న శుక్రవారం ఆయన భీమారంలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తన కుమార్తె ఎంపీపీ చెరుకు దీపికారెడ్డి, జడ్పీటీసీ భూక్య తిరుమల, నర్సింగాపూర్ ఎంపీటీసీ పెద్దల రూప, బూరుగుపల్లి, నర్సింగాపూర్, కొత్తపల్లి, కాజీపల్లి, ఆరెపల్లి, ధర్మారం సర్పంచులు చెడంక లక్ష్మి, దుర్గం మల్లేశ్, గోదారి తిరుపతి, అనపర్తి సునీత, దాడి తిరుపతి, వడ్లకొండ రమాదేవి, మాజీ జడ్పీటీసీ జర్పుల రాజ్‌కుమార్, కో ఆప్షన్ మెంబర్ బాబర్‌ఖాన్ టీఆర్ఎస్ ను వీడనున్నట్టు తెలిపారు.
ఇక ఎమ్మెల్యే బాల్క సుమన్వ్యవహార శైలిపై నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు,ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ హై కమాండ్ వద్ద సుమన్ కు ఉన్న పలుకుబడితో నియోజకవర్గంలోని సీనియర్ లీడర్లను పథకం ప్రకారం రాజకీయంగా అణగదొక్కుతూ సొంత కోటరీ నిర్మించుకుంటున్నాడనే విమర్శల ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సుమన్ పై తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా.. కోటపల్లి మండలానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, సుమన్మధ్య ఎప్పటినుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇక సతీశ్ కు రెండోసారి ఎమ్మెల్సీ పదవి రాకుండా సుమన్ అడ్డుకున్నారని ఆయన అనుచరులు గుర్రుగా ఉన్నారు. అయితే.. జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ మూల రాజిరెడ్డితోనూ విభేదాలు ఉన్నాయి. దీంతో, చెరుకు సరోత్తం రెడ్డికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు. ఇక 2014లో ఎంపీగా, 2018లో ఎమ్మెల్యేగా సుమన్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పాటుపడితే తమకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే సుమన్ తన తీరును మార్చుకోకపోతే నియోజకవర్గంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
Pilgrims Rush In Tirumala: ఆగస్టులో తిరుమలకు 22.22 లక్షలమంది భక్తులు
