Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!

  • 27 కిలోల మెఫెడ్రోన్‌ స్వాధీనం
  • ల్యాబ్‌పై దాడి.. డ్రగ్ తయారీ గుట్టురట్టు
  • నలుగురు నిందితుల అరెస్ట్
  • పరారీలో మరో నలుగురు.. పోలీసుల వేట
Seized

Seized

Mephedrone Seized : యాదాద్రి-భువనగిరి జిల్లాలో పోలీసులు భారీ డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను ఛేదించారు. బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండమడుగు గ్రామంలో ఎస్ఓటీ (SOT) , స్థానిక పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో దాదాపు రూ.54 కోట్ల విలువ చేసే 27 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొండమడుగు గ్రామ శివారులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న MH-49-CW-1313 నంబర్ గల ఫార్చ్యూనర్ కారును పోలీసులు అడ్డుకుని తనిఖీ చేయగా, అందులో అక్రమంగా రవాణా చేస్తున్న 27 కిలోల మెఫెడ్రోన్‌తో పాటు, డ్రగ్స్ తయారీలో ఉపయోగించే సుమారు 40 కిలోల అసిటోన్ లిక్విడ్‌ను గుర్తించి సీజ్ చేశారు.

వేటుకూరి ల్యాబ్స్‌లో డ్రగ్స్ తయారీ – అరెస్టయిన నిందితుల వివరాలు

ఈ తనిఖీల విచారణలో భాగంగా కొండమడుగు గ్రామంలోని ‘వేటుకూరి ల్యాబ్స్’లో ఇతర సహచరుల సహకారంతో అక్రమంగా మెఫెడ్రోన్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ల్యాబ్‌పై దాడి చేసి అక్కడ డ్రగ్ తయారీకి ఉపయోగిస్తున్న రియాక్టర్, సెంట్రిఫ్యూజ్ , ఇతర పరికరాలను సీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో ప్రధాన ఆర్గనైజర్ నాగ్‌పూర్‌కు చెందిన చేతన్ మధుకర్ మెష్రామ్ (49), తయారీలో సహకరించిన అస్సాంకు చెందిన ముజామల్ హక్ (25), అక్రమ రవాణాలో భాగస్వామి అయిన నాగ్‌పూర్‌కు చెందిన ఆకాశ్ అశోక్ గవాండే (31) , వేటుకూరి ల్యాబ్స్ ఇన్‌చార్జిగా వ్యవహరించిన చందానగర్‌కు చెందిన ఉపద్రష్ట రమణ మూర్తి (65)లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పరారీలో మరో నలుగురు నిందితులు

ఈ కేసులో ల్యాబ్ ఏర్పాటు, ముడి పదార్థాల సేకరణ , కెమిస్ట్‌ను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన అస్సాంకు చెందిన ఎం.డి. అయూబ్ అలీ, నాగ్‌పూర్ డ్రగ్ పెడ్లర్లు చందా ప్రదీప్ ఠాకూర్, గోపాల్ సిర్పట్ పటేలియా , పీర్జాదిగూడకు చెందిన వేటుకూరి ల్యాబ్స్ యజమాని యేటుకూరి రామరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఈ నలుగురు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.