తెలంగాణ శాసనసభలో భూ సమస్యలు, 22A నిబంధనలు , ధరణి అక్రమాలపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొత్తగా తీసుకొస్తున్న ‘భూభారతి’ చట్టం ఏమాత్రం ఆషామాషీగా రూపొందించలేదని, దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేశాక, పబ్లిక్ అభిప్రాయాలు సేకరించిన తర్వాతే దీనికి రూపకల్పన చేశామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యేతో పాటు బిఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్ ఇచ్చిన మంచి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని, తాము మంచి చేస్తుంటే విషం చిమ్మే సంస్కృతి ప్రతిపక్షానిదని మండిపడ్డారు. భూభారతి ఎన్ఐసి (NIC) పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే పారదర్శకంగా నడుస్తుందని స్పష్టం చేశారు.
ధరణి పేరుతో విచ్చలవిడిగా దోపిడీ
గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా తీవ్ర దోపిడీ జరిగిందని మంత్రి ఆరోపించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలంలోని 13 గ్రామాల్లో 14 వేల ఎకరాలను సర్వే చేయగా, అందులో ఏకంగా 4 వేల ఎకరాలకు బోగస్ పాస్ పుస్తకాలు సృష్టించినట్లు తేలిందన్నారు. ఈ నకిలీ పాస్ పుస్తకాలతో కోట్ల రూపాయల రైతుబంధు నిధులను కొల్లగొట్టారని వెల్లడించారు. అలాగే మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందిస్తూ.. అల్వాల్‌లో ప్రాహిబిటెడ్ జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములను అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తేలడంతో సంబంధిత సబ్ రిజిస్ట్రార్‌ను వెంటనే సస్పెండ్ చేశామని తెలిపారు. నారాయణపురంలో గిరిజనులకు దశాబ్దాలుగా పట్టాలు లేక అసెంబ్లీ వద్ద గోడు చెప్పుకునే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.
23 వేల ఎకరాల అక్రమాలు – సిట్ (SIT) విచారణ
బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి అడిగిన ఆడిట్ అంశంపై స్పందిస్తూ.. ఫోరెన్సిక్ ఆడిట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. ధరణిలో దాదాపు 23 వేల ఎకరాల అక్రమాలు జరిగినట్లు తేలడంతో దానిపై ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) రంగంలోకి దించినట్లు ప్రకటించారు. గత 9 ఏళ్ల పాలనలో భాగస్వాములైన కంపెనీలు ప్రవేశించి అసైన్డ్ భూములను సైతం తమ పేరిట మార్చుకున్నాయని, ప్రైమ్ లొకేషన్లలో ఉన్న 50కి పైగా అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్న తీరుపై ప్రస్తుతం లోతైన విచారణ జరుగుతోందన్నారు.
హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన.. లక్ష కోట్లు కొల్లగొట్టే కుట్ర
గత పాలకులు రూ. లక్ష కోట్లు కొల్లగొట్టాలనే ఆలోచనతోనే హైకోర్టు తీర్పులను కూడా తుంగలో తొక్కారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. 22A నిబంధనలను A, B, C, D, E లూగా విభజించాలని హైకోర్టు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని, 120 జిఓ తెచ్చినప్పటికీ దాన్ని అమలు చేయలేదని తెలిపారు. ఇక ప్రొహిబిటెడ్ భూముల జాబితాలో ప్రస్తుతం జరిగిన పొరపాట్లపై స్పందిస్తూ.. తమ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి భూములను ఆ జాబితాలో పెట్టలేదని, గత ప్రభుత్వం తయారు చేసిన పాత కాపీలనే అధికారులు అప్‌లోడ్ చేశారని వివరించారు. ఈ పొరపాటు సీఎం కోసమో, తన కోసమో అధికారులు ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు.
మాక్ అసెంబ్లీలపై ఘాటు వ్యాఖ్యలు
ప్రతిపక్షాల మాక్ అసెంబ్లీ తీరును మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. “అసలైన శాసనసభ ఇక్కడ జరుగుతుంటే బయట మాక్ అసెంబ్లీ నిర్వహించడం ఏంటి? గతంలో చేసిన తప్పులకు క్షమాపణ చెప్పి ధైర్యం ఉంటే సభలో కూర్చొని మాట్లాడాలి. పదేళ్ల పాటు చేయాల్సిన తప్పులన్నీ చేసి ఇప్పుడు నంగనాచి మాటలు మాట్లాడుతున్నారు” అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

