Bhatti Vikramarka Says Raja Singh Very Dangerous For Society: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మాటలు అల్లర్లకు దారితీసేలా ఉన్నాయని, రాజాసింగ్‌ను కట్టడి చేయాలని చెప్పారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి.. పరమత సహనం పాటించాలని హితవు పలికారు. ప్రభుత్వం అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. ఒకవేళ కట్టడి చేయకపోతే, ఆ తర్వాత జరిగే నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
గతంలో దళితుల మీద కూడా రాజా సింగ్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తినే తిండి మీద కూడా మాట్లాడి అతను అవమాన పరిచాడని మండిపడ్డారు. సమాజానికి రాజాసింగ్ చాలా ప్రమాదని, రాజ్యంగబద్దంగా అతనిపై బీజేపీ చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒకవేళ తీసుకోకపోతే.. బీజేపీ విధానం కూడా రాజాసింగ్ లాంటిదేనని భావించాల్సి వస్తుందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణపై మిడతల దండులాగా బీజేపీ దాడి చేస్తోందని ఆగ్రహించారు. బీజేపీ విధానాలు దేశ సమగ్రతకు పెను ప్రమాదంగా మారాయని.. బీజేపీ రాజకీయాల కారణంగా దేశం కల్లోలం అవుతోందని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజల అప్రమత్తంగా ఉండాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. కేవలం ఒక్క రాజాసింగ్ మాత్రమే కాదు.. ఏ మతం వారైనా, ఇంకో మతాన్ని కించపరిచేలా మాట్లాడకూడదని, అలా మాట్లాడితే వెంటనే వారిని కట్టడి చేయాలని చెప్పారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే.. ఆ పదవికి అతడు అనర్హుడు అవుతాడని అన్నారు. రాజకీయ లబ్ది కోసం కొందరు పరిధికి మించి ప్రవర్తిస్తున్నారని భట్టి విక్రమార్క ఫైరయ్యారు.
