నగరం కొన్ని సంస్థలను నిర్మిస్తే.. మరికొన్ని సంస్థలు ఆ నగర ఆత్మను నిర్మిస్తాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సలార్ జంగ్ మ్యూజియం హైదరాబాద్ నగర ఆత్మకు ప్రతిరూపమని అన్నారు. సలార్ జంగ్ మ్యూజియం 75వ వసంతాల వేడుకలతో పాటు, మీర్ యూసుఫ్ అలీఖాన్ (సలార్ జంగ్-3) 137వ జయంతి ఉత్సవాల్లో ఆయన ఆదివారం నాడు పాల్గొన్నారు. ఈ సందర్భమగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ఒడిసిపట్టిన మహోన్నత వ్యక్తి సలార్ జంగ్-3 అన్నారు. సాధారణంగా మనం మన కళ్ళజోడు, మొబైల్ ఫోన్, కార్ కీస్ లాంటి చిన్న వస్తువులనే మర్చిపోతుంటాం. కానీ సలార్ జంగ్-3 ఏకంగా ప్రపంచ నాగరికతలనే భద్రపరిచారని అన్నారు. 43 వేల కళాఖండాలను సేకరించడం అంటే అది కేవలం సేకరణ కాదు.. కళలపై ఆయనకున్న అపారమైన భక్తి అని చెప్పారు. ప్రపంచంలోని అరుదైన సౌందర్యాన్ని, చరిత్రను తన సొంత నిధుల నుంచి సేకరించి.. వాటన్నింటినీ ప్రజల ఆస్తిగా మార్చిన ఆయన ఉదారత సాటిలేనిదిని చెప్పారు. ఈ మ్యూజియంలో హిందువుల కాంస్య విగ్రహాలు, పవిత్ర ఖురాన్ ప్రతిమలు, క్రైస్తవ మడోన్నా శిల్పాలు, బౌద్ధ కళాఖండాలు ఒకే చోట కొలువై ఉన్నాయని చెప్పారు. విష్ణుమూర్తి దశావతారాలు, ఖురాన్ శ్లోకాలు కలిసి ఉన్న ఆచార వస్తువులు ఇక్కడి ప్రత్యేకతగా ఆయన అభివర్ణించారు. ఇది మత సామరస్యానికి ప్రసంగం కాదు.. లౌకికత్వానికి సజీవ సాక్ష్యం. ఇదే దక్కన్ గంగా-జమునా తెహజీబ్ అని చెప్పారు.
మ్యూజియం పక్కనే ప్రవహించే ముసి నది అంటే హైదరాబాద్ జ్ఞాపకాల ప్రవాహం అని అన్నారు. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ముసి నదిని ప్రక్షాళన చేసి, లండన్ లోని థేమ్స్, పారిస్ లోని సీన్ నది తరహాలో అంతర్జాతీయ స్థాయి రివర్ ఫ్రంట్‌గా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సలార్ జంగ్ మ్యూజియం కేవలం ఒక ఒంటరి భవనంగా కాకుండా.. అభివృద్ధి చెందిన ముసి రివర్ ఫ్రంట్‌కు ఒక సాంస్కృతిక కిరీటంగా మారబోతోందన్నారు. పర్యాటకులు నది గుండా ప్రయాణిస్తూ, ఇక్కడి వారసత్వ వీధుల్లో నడుస్తూ, చారిత్రక కళాఖండాలను వీక్షించేలా ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని అన్నారు.
హైదరాబాద్ అంటే కేవలం చార్మినార్ మాత్రమే కాదు.. సైబర్ టవర్స్ నగరం కూడా అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ అంతే వేగంగా ఎదుగుతోందిని చెప్పారు. బిర్యానీతో పాటు బయోటెక్నాలజీ, ఐటీ, ఫార్మా రంగాల్లో గ్లోబల్ పవర్‌హౌస్‌గా ఉన్నాం. హైదరాబాద్ ఎప్పుడూ చరిత్రకు, భవిష్యత్తుకు మధ్య దేనినో ఒకదానినే ఎంచుకోలేదు.. రెండింటినీ రెండు చేతులా గుండెకు హత్తుకుందన్నారు.
చార్మినార్, గోల్కొండ, కుతుబ్ షాహీ సమాధులు, చౌమహల్లా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లతో కూడిన ఓల్డ్ సిటీ హెరిటేజ్ సర్క్యూట్‌ను సలార్ జంగ్ మ్యూజియంతో అనుసంధానిస్తామని అన్నారు. మెరుగైన రవాణా సౌకర్యాలు, నైట్ టూరిజం, తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గైడెడ్ వాక్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారసత్వం అనేది కేవలం గర్వపడటానికే కాదు.. స్థానిక గైడ్‌లు, కళాకారులు, హోటళ్లు, రవాణా రంగాల ద్వారా వేలాది మందికి జీవనోపాధి కల్పించడానికి ఉపయోగపడాలన్నారు.
తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ వరకు ప్రతి విద్యార్థి ఈ మ్యూజియాన్ని సందర్శించి ‘ఇది నా ఆస్తి’ అనే ఆత్మవిశ్వాసాన్ని పొందాలన్నారు. మ్యూజియం అనేది నిశ్శబ్దంగా ఉండే ప్రదేశం కాకూడదన్నారు. మ్యూజియం అనేది ప్రశ్నలతో సజీవంగా ఉండాలి. ఇందుకోసం పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో (University of Hyderabad, IITs, IIITs, ISB) ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకుంటామని చెప్పారు.
అలాగే హైదరాబాద్‌కు ఐటీ, బిజినెస్ పనుల మీద వచ్చే గ్లోబల్ ఇన్వెస్టర్లు కేవలం బోర్డ్‌రూమ్‌లకే పరిమితం కాకుండా.. కనీసం ఒక రోజు సలార్ జంగ్ మ్యూజియాన్ని సందర్శించి, చార్మినార్ వద్ద ఇరానీ చాయ్ తాగి ఇక్కడి సంస్కృతిని ఆస్వాదించాలని ఆయన కోరారు. మన బిర్యానీ, హలీమ్, చాయ్ కేవలం ఆహార పదార్థాలు కావు.. తెలంగాణ సాంస్కృతిక ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభాలన్నారు.
ఈ 75 ఏళ్ల ప్రయాణంలో మ్యూజియాన్ని కాపాడుకుంటూ వస్తున్న క్యూరేటర్లు, కన్సర్వేటర్లు, సెక్యూరిటీ, క్లీనర్లు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. మీరే హైదరాబాద్ జ్ఞాపకాలకు అసలైన కాపలాదారులు. సలార్ జంగ్-3 సేకరించిన ఈ అమూల్యమైన సంపదను మరింత ఆధునీకరించి, భవిష్యత్తు తరాలకు సగర్వంగా అందించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

