Bhatti Vikramarka Open Letter To CM KCR On Police System: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. గురువారం దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం నక్కలగండి ప్రాజెక్టు పాదయాత్ర శిబిరం వద్ద ఈ లేఖను విడుదల చేశారు. తన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా తిరిగిన అనేక జిల్లాలు, నియోజకవర్గాలు, గ్రామాల్లో.. క్షేత్రస్థాయి పోలీసులు తమను వేధింపులు, ఇబ్బందులు గురి చేస్తున్నట్టు ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. పోలీసుల వల్ల ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని గ్రహించి, తాను సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశానని స్పష్టం చేశారు.
Uttam Kumar Reddy: సర్వే ప్రకారం.. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థ.. అధికార పార్టీ స్థానిక శాసనసభ్యుల ఆదేశాలను అమలు చేస్తూ, బీఆర్ఎస్ పార్టీకి ప్రైవేటు సైన్యంగా మారిందని భట్టి విక్రమార్క ఆరోపణలు చేశారు. పోలీసు ఉన్నతాధికారులైన డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ లాంటి అధికారులతో.. క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు అధికారులు డీ లింకు అయ్యి.. ఉన్నతాధికారులు చెప్పినట్టుగా కాకుండా, అధికార పార్టీ స్థానిక శాసనసభ్యులు ఆదేశాలను పాటిస్తూ, వారికి అటాచ్ అయిపోయి, వారిచే ఆదేశాలను అమలు చేసే పోలీసులుగా మారిపోయారని దుయ్యబట్టారు. వీళ్లు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా పోలీసు వ్యవస్థ ప్రైవేటు సైన్యంగా మారిపోవడంతో.. సమాజంలోని అనేక వర్గాల ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే హక్కును కోల్పోయారని అన్నారు.
Harish Rao: కాంగ్రెస్, బిజెపి వాళ్ళవి మాయమాటలు.. కన్ఫ్యూజ్ చేసి సీట్లు గెలవాలని చూస్తున్నారు
ప్రశ్నించే గొంతుకలు, కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీల వాదులు, రాజకీయ పార్టీలు.. స్వేచ్ఛగా భావజాలాన్ని వ్యక్తపరచుకునే పరిస్థితి లేకుండా పోయిందని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల ఇష్టాఇష్టాల ప్రకారం పోలీసులు నడుచుకుంటే.. సమాజంలో బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. పోలీసు వ్యవస్థను ప్రజల రక్షణ కోసం ఉపయోగించాలే తప్ప.. రాజకీయ పార్టీల కోసం కాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఆయా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ.. వ్యవస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయన్నారు. కాబట్టి.. పోలీసు వ్యవస్థను ప్రజల కోసమే ఉపయోగించాలని సీఎం కేసీఆర్‌కు భట్టి విక్రమార్క ఆ లేఖలో డిమాండ్ చేశారు.