NTV Telugu Site icon

Bhatti Vikramarka: టీఆర్ఎస్ మాత్రమే కాదు.. బీజేపీ కూడా ఎమ్మెల్యేలను కొన్నది

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka Fires On BJP TRS Parties Over Moinabad Farm House Issue: మొయినాబాద్ ఫాంహౌస్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు జరిగిన బేరసారాల వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడం కొత్త కాదని.. ఇప్పటికే సీఎం కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని వ్యాఖ్యానించారు. బీజేసీ సైతం.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం కొత్త కాదని.. ఇప్పుడేదో కొత్తగా జరుగుతున్నట్టు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. సర్పంచుల నుంచి మొదలుకొని.. టీఆర్ఎస్ పార్టీని అందరినీ కొనుగోలు చేసిందని ఆరోపించారు.

ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కొత్తగా తెరలేపిన డ్రామాను రక్తి కట్టించేందుకు నిన్న రాత్రి నుంచి తెగ ప్రయత్నిస్తున్నాయని.. ప్రజలు ఆ డ్రామాల్ని నమ్మడం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే తాము టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటామని బీజేపీ మొదటి నుంచి చెప్తూ వస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు విషయం టీఆర్ఎస్ దగ్గరికి వచ్చేసరికి.. ఏదో జరిగిపోతోందంటూ ఆ పార్టీ గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల వ్యవహారం చాలా నీచంగా ఉందన్న ఆయన.. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగుల్ని ఆ రెండు పార్టీలు తమకు అనుగుణంగా భలే వాడుకుంటున్నాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ప్రారంభించిందే టీఆర్ఎస్ పార్టీ అని, దాన్ని బీజేపీ కొనసాగిస్తోందని విమర్శించారు.

తెలంగాణలో రాజకీయాలన్నీ అమ్మకం, కొనుగోలు చుట్టే తిరుగుతున్నాయని ఆగ్రహించిన భట్టి విక్రమార్క.. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వస్తే.. 10వ షెడ్యూల్‌ని పూర్తిగా మార్చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.

Show comments