తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ భేటీకి సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క గైర్హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో నిర్వహించే సమావేశానికి తాను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా రాలేకపోతున్నానని, అధిష్టానానికి ముందస్తు సమాచారం ఇచ్చినట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజాసమస్యల పరిష్కారం కొరకు మధిర నియోజకవర్గంలో గత నెల 27 నుంచి పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్నానన్నారు. పాదయాత్ర పూర్తి అయిన తర్వాత వచ్చి కలుస్తాను అని అధినేతకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకున్నందునే ఈ రోజు ఢిల్లీలో జరిగే ముఖ్య నాయకుల సమావేశానికి వెళ్లలేదన్నారు. పాదయాత్ర ముగించుకున్న తర్వాత ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ గారిని కలుస్తానని వెల్లడించారు.