NTV Telugu Site icon

Bhagyanagar Ganesh Utsav Samithi: తగ్గేదే లే… హుస్సేన్‌ సాగర్‌లోనే నిమజ్జనం చేసి తీరుతాం..

Bhagwanth Rao

Bhagwanth Rao

గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్‌ సాగర్‌లోనే చేసి తీరుతాం అని ప్రకటించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు… వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు.. కానీ, విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసిన ఆయన.. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం నిమజ్జనం ఏర్పాట్లను ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని సూచించారు. మండప నిర్వహకులు ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి… ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి మండపంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులను స్మరించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు భగవంత్‌ రావు..

Read Also: Thank You Movie Review : ధ్యాంక్యూ రివ్యూ

ఇక, గణేష్‌ ఉత్సవాల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు భగవంత్‌ రావు.. సంస్కృతి సాంప్రదాయాల బద్దంగా.. డీజే, సినిమా పాటలు, జీన్స్ డాన్సులు లేకుండా ఉత్సవాలు జరపాలని సూచించారు. కాగా, వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై గురువారం ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని తెలిపింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. పీవోపీ విగ్రహాలు జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసే నీటి గుంటల్లోనే నిమజ్జనం చేయాలని వెల్లడించింది. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది హైకోర్టు. అలాగే విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది.. ఇదే సమయంలో దుర్గాపూజపై పశ్చిమ బెంగాల్ మార్గదర్శకాలను పరిశీలించాలని సూచించింది హైకోర్టు.