భద్రాచలంలో రాములోరి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిపేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ సీతారామ కళ్యాణం కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. రెండేళ్ల తరువాత కరోనా అనంతరం జరుగుతున్న కల్యాణ మహోత్సవం చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. మిథిలా స్టేడియంను ఇప్పటికే పోలీస్ యంత్రాంగం తన చేతుల్లోకి తీసుకుంది.. ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్ర కిరణ్ రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను తీసుకుని వచ్చి స్వామి వారికి అందివ్వనున్నారు.
భక్తులు ఇప్పటికే స్టేడియం కు చేరుకుంటున్నారు. ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు తెలంగాణ నుంచే కాదు, ఏపీ, చత్తీస్‌గడ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రామయ్య కల్యాణ కమనీయ దృశ్యాలను భక్తులు కనులారా వీక్షించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తరలించనున్నారు.