Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!

  • నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాల పరిశీలన..
  • సాంకేతిక నివేదిక అనంతరం తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి హామీ..
  • కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ..
Kothagudem Airport

Kothagudem Airport

Kothagudem Airport: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుంది. న్యూఢిల్లీలో మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో సమావేశమైన అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు.

గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేవని తేలడంతో.. తాజాగా నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ స్థలాల్లోని భౌగోళిక, వాతావరణ పరిస్థితులతోపాటు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సాధ్యాసాధ్యాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుందని చెప్పారు. కేంద్ర సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వచ్చిన తర్వాత కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

తెలంగాణలోని మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 2న కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తండ్రి, దివంగత ఎర్రన్నాయుడు తన చిరకాల మిత్రుడని మంత్రి తుమ్మల గుర్తుచేసుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని, జిల్లా ప్రజలకు విమానాశ్రయం అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. నా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, వెంటనే కేంద్ర సాంకేతిక బృందాన్ని పంపేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.