Site icon NTV Telugu

Collector Fish Cutting: చేపలను బోన్‌లెస్‌గా ఎలా కట్ చేయాలో చూపించిన కలెక్టర్!

Khammam

Khammam

Collector Fish Cutting: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఫిష్ వ్యాపారులు, మత్స్యకారులతో కలిసి చేపలను బోన్‌లెస్‌గా (ముళ్లు లేకుండా) తయారు చేసే విధానంపై ప్రత్యక్ష ప్రాక్టికల్ డెమో ఇచ్చారు. ఈ విధంగా చేపలను బోన్‌లెస్‌గా తయారు చేయడం ద్వారా వాటి మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అందరు ఈ విధానం నేర్చుకోవడం ద్వారా మత్స్యకారులు, ఆదివాసీలతో పాటు చేపలపై ఆధారపడి జీవించే కుటుంబాలు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందన్నారు. బోన్‌లెస్ చేప ముక్కలను పిల్లలు, పెద్దలు సులభంగా తినగలిగే విధంగా ఉండటంతో మంచి పోషకాహారం అందించే ఛాన్స్ ఉంటుందని వివరించారు. ఇక, బోన్‌లెస్ చేప ముక్కల ద్వారా చికెన్ టిక్కా లాంటి రకరకాల వంటకాలు, ఐటమ్స్ తయారు చేసి చేపలకు కొత్త విలువ చేర్చవచ్చని తెలిపారు. తద్వారా చేపలను తినే ప్రజలకు కొత్త రుచులు అందించడం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవడం సాధ్యమవుతుందని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు.

Read Also: Off The Record: త్వరలో ప్రభుత్వ విప్‌ పదవుల భర్తీ..

అలాగే, చేపల తలలు, మిగిలిన భాగాలతో పోషక విలువ గల రుచికరమైన సూప్ తయారు చేసి జిల్లా వాసులకు అందించడం ద్వారా ఆరోగ్యం, ఆదాయం రెండూ సంపాదించుకోవచ్చునని, అలాగే మిగిలిన వ్యర్థాలను ఎరువుగా వాడటం ద్వారా పర్యావరణం పరిరక్షణతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని వెల్లడించారు. ఈ ప్రయత్నం ద్వారా మత్స్యకారులు, ఫిష్ వ్యాపారులు, SHG మహిళలు తమ సామర్థ్యాన్ని పెంచుకొని, ఆరోగ్యకరమైన ఆహారం అందించడంతో పాటు ఆదాయ మార్గాలను కూడా విస్తరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రోత్సహించి మరిన్ని కుటుంబాలు లబ్ధిపొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Exit mobile version