Site icon NTV Telugu

TS: దంచికొడుతున్న ఎండలు.. ఆ సమయంలో అవసరం అయితేనే బయటకు రండి..

మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి… రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ మంట పుట్టిస్తున్నాయి… ఓవైపు ఎండల తీవ్రత.. మరోవైపు వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. దీంతో ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక సూచనలు చేసింది.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జ‌గిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల‌కు వాతావ‌ర‌ణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసిందని వెల్లడించారు ప్రజారోగ్య సంచాల‌కులు డాక్టర్ శ్రీనివాస్ రావు. ఆ జిల్లాలతో పాటు భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖ‌మ్మం, హైద‌రాబాద్‌లో 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్రత‌లు న‌మోదు అవుతున్నాయని తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో.. మధ్యాహ్న సమయంలో రోడ్లపై తిరగొద్దని సూచించారు.. అత్యవసరం అయితే మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలన్న ఆయన.. లేదంటే ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు..

Read Also: Vijayasai Reddy: కాంగ్రెస్‌ వల్లే నేను రాజ్యసభకు రాగలిగా.. సాయిరెడ్డి ఛలోక్తులు

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నల్లటి దుస్తులు వేసుకోవద్దు.. తెల్లటి దుస్తులు వేసుకుంటే ఎండ ప్రభావం తక్కువగా ఉంటుందని తెలంగాణ ఆరోగ్య శాఖ పేర్కొంది.. ఈ సమయంలో ఫ్లూయిడ్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎండదెబ్బె తగిలిందంటే చెమట పట్టకపోవడం, గొంతు ఎండిపోవడం, అత్యంత నీరసం, తలనొప్పి, గుండెదడ, మూత్రం రాకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని.. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని తెలిపారు. ఇక, ట్రాఫిక్ పోలీసులు, గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసేవాళ్లు, జర్నలిస్టులు, ఎక్కువగా తిరిగేవాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. ఇక, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అంగన్ వాడీ కేంద్రాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విరివిగా అందుబాటులో పెట్టామని.. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని.. ఈ కాలంలో ఫుడ్, వాటర్ ఎక్కువగా పొల్యూట్ అయ్యే అవకాశం ఉందని.. చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించినట్టు తెలిపారు.. కోవిడ్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉందని.. 20పైగా జిల్లాల్లో సున్నా కేసులు నమోదు అవుతున్నాయని.. జీహెచ్‌ఎంసీలో 20 వరకు కోవిడ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయని.. కరోన ఆంక్షలు కేంద్రం పూర్తిగా తొలగించింది.. కానీ, రాష్ట్రంలో మాస్క్, భౌతికదూరం పాటించాలని తెలంగాణ ఆరోగ్య శాఖ పేర్కొంది.

Exit mobile version