Yadadri: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటలకే సూర్యుడి ప్రతాపం కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు రావాలంటే జంకుతున్నారు. ఎండతాపానికి కాస్త దూరం వెళ్లే సరికి ఆయాసం, చెమటతో విసుగు చెందుతున్నారు. అలాంటిది ఇంత ఎండలో దేవున్ని దర్శనకోసం ఎండలో నడక అంటే వామ్మో ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. ఎండవల్ల యాదాద్రికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆధ్వర్యంలో కొండపైకి వెళ్లేందుకు మూడు బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేసింది. ఈ బ్యాటరీ వాహనాలను ఆలయ ఈవో గీతకు అందజేశారు. దీని విలువ రూ. 21 లక్షలు ఉంటుందని ఎస్‌బీఐ బ్యాంకు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో ఈ తరహా వాహనాలు భక్తులకు సేవలందిస్తున్నాయి. తాజాగా యాదాద్రి ఆలయంలోనూ భక్తులకు ఎలక్ట్రానిక్ బ్యాటరీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. సోమవారం ఈ వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం ఈవో గీత మాడవీధుల గుండా ప్రయాణించారు. ఆలయానికి పశ్చిమ దిశలో మహారాజ గోపురం నుంచి శివాలయం మెట్ల వరకు భక్తులకు ఈ వాహన సౌకర్యం కల్పించనున్నట్లు ఈవో వివరించారు.
Read also: Train Accident: 48 గంటలు నరకయాతన.. పొదల్లో సజీవంగా రైలు ప్రమాద బాధితుడు
భక్తులకు చిరుధాన్యాల ప్రసాదం పంపిణీ..
యాదాద్రిలో భక్తులకు చిరుధాన్యాల ప్రసాదం పంపిణీ చేయాలని దేవస్థానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర దేవతా శాఖ ఆదేశాల మేరకు దైవ దర్శనానికి వచ్చే భక్తులకు పులిహోర ప్రసాదం నిరంతరం పంపిణీ చేస్తున్నారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చిరుధాన్యాలను ప్రసాదంగా ఇవ్వాలని ఇటీవల ధార్మిక శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. మంత్రి ఆదేశాలతో యాదాద్రి దేవస్థానం చిరుధాన్యాల ప్రసాదం పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా ఈ నెల 21న ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించనున్నారు. ఆ రోజు యాదాద్రిలో చిరుధాన్య ప్రసాదాలు అందించాలని దేవస్థానం యోచిస్తోంది. అదే రోజు నిత్యాన్నప్రసాద భవనం ప్రారంభోత్సవానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక తాజాగా శ్రీశైలం ఆలయంలో భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాలను అందుబాటులో ఉంచారు. ఈ వాహనాలను ఏపీ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయంలో పశ్చిమ మాడవీధిలో ప్రారంభించారు. ప్రస్తుతం ఐదు వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో పంచ మఠాల సందర్శనకు మూడు వాహనాలు, మరో రెండు వాహనాలను ఆర్టీసీ బస్టాండ్ నుంచి క్షేత్ర పరిథిలోని పలు ముఖ్యమైన ప్రాంతాలకు నడపనున్నారు. ఈ వాహనాల ద్వారా ఘంట మఠం, భీమ శంకర మఠం, విభూతి మఠం, రుద్రాక్ష మఠం, సారంగధర మఠం, మహిషాసురమర్దిని ఆలయం, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, దేవస్థానం గోశాల, బయలు వీరభద్రస్వామి దేవాలయం, కాళమ్మ దేవాలయాలు అనే ఐదు మఠాలను భక్తులు దర్శించుకోవచ్చు. మిగిలిన రెండు వాహనాలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి సీఆర్‌వో ఆఫీస్, గంగా గౌరీ సదన్, మల్లికార్జున సదన్, వృద్ధులు, వికలాంగుల క్యూ కాంప్లెక్స్‌కు అందుబాటులో ఉంటాయి.
Birthday Party: పుట్టిన రోజే పొట్టన పెట్టుకున్నారు.. ఫుడ్ బిల్లు కట్టలేదని కత్తితో పొడిచేశారు..