తెలంగాణలో దసరా పండుగకి ప్రత్యేక స్థానం ఉంది.. ఇక, దసరా కంటే ముందు నుంచే నిర్వహించే బతుకమ్మ పండుగ అంటే ఎంతో ప్రత్యేకం.. ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. తెలంగాణ ఆడపడుచులంతా ఉత్సాహంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు.. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. దసరాను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం.. బతుకమ్మల సందర్భంగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తూ వస్తోంది.. ఈ ఏడాది కూడా ఇందుకోసం 289 రకాల చీరలు సిద్ధం చేసింది. అక్టోబర్ నెల 6 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం కానుండగా, అంతకు నాలుగు రోజుల ముందు నుంచే సందడి ప్రారంభం కానుంది.. ఎందుకంటే.. ఈ ఏడాది కూడా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం పంపిణీ చేసే బతుకమ్మ చీరలను అక్టోబరు 2 నుంచి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే, సిరిసిల్ల చేనేత కళాకారులు తయారుచేసిన బతుకమ్మ చీరలు అన్ని జిల్లాలకు చేరాయి.. పంపిణీ కోసం ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు అధికారులు.. మరోవైపు.. హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం బతుకమ్మ చీరల పంపిణీపై సందేహాలు నెలకొన్నాయి. ఇక, ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో ఉంది.. దీంతో.. కరీంనగర్, హన్మకొండ జిల్లాల్లో చీరల పంపిణీ ఎలా అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఈసీని సంప్రదించిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది బతుకమ్మ చీరాల కోసం రూ.318 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం.. 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలలో బతుకమ్మ చీరలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రేషన్ కార్డులతో వచ్చే లబ్ధిదారులకు ఈ చీరలను పంపినీ చేయనున్నారు. మొత్తంగా.. అక్టోబర్ మొదటి నుంచే పండుగ వాతావరణం రాబోతోంది.