NTV Telugu Site icon

Bandi Sanjay : ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు అని బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రుల తరపున మోడీకి బండి సంజయ్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం అక్కడ చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన కలిగించిందని, ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురిఅయ్యారని ఆయన అన్నారు.
సరిగ్గా ఈ సమయంలో మోడీ తన రాజకీయ చతురతతో విద్యార్థులను ప్రత్యేక విమాన సర్వీసుల ద్వారా భారత్ కు తరలిస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న భారతీయుల యోగ క్షేమాలకు ప్రధాని అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. ప్రధాన మంత్రి మార్గదర్శకత్వంలో విదేశాంగ శాఖ ప్రతీ క్షణం ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను వెనకీ తీసుకువచ్చే విషయం పైనే పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే విద్యార్థులతో పలు విమానాలు బయలు దేరాయని, మరిన్ని రాబోతున్నాయని ఆయన తెలిపారు. మాకు అందుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖకు తెలియ జేస్తున్నామని, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న చాలా మంది తెలుగు విద్యార్థులతోను, ఇక్కడున్న వాళ్ళ తల్లిదండ్రులతో నేను స్వయంగా మాట్లాడానని ఆయన పేర్కొన్నారు. మా పార్టీ నాయకులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ వాళ్లలో భరోసా నింపుతున్నారన్నారు. విమానంలో విద్యార్థులు చేస్తున్న భారత్ మాతాకీ జై, వందే మాతరం నినాదాలు భారతీయుల్లో మరింత భరోసా నింపుతున్నాయన్నారు. ప్రయాణ ఖర్చుల్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించి ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేసిందని, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండండని ఆయన ధైర్యం నింపారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ కేంద్ర ప్రభుత్వం తీసుకుని వస్తుందని హామీ ఇచ్చారు.