Bandi Sanjay: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలపై విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిపారు. భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ ద్రుష్టికి వచ్చిందని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కారకులు కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులిచ్చి విచారిస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయత పెరిగేదన్నారు. ఆ పని చేయకపోవడంవల్లే సీబీఐ విచారణ కోరుతున్నామన్నారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత తీవ్రమైన నేరమన్నారు. ప్రజాప్రతినిధులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రసాదించిన హక్కులను కూడా ఫోన్ ట్యాపింగ్ తో కాలరాశారన్నారు. భార్యాభర్తలు మాట్లాడుకునే అంశాలను కూడా ట్యాపింగ్ చేసి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో వ్యాపారులు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలుసహా పలువురు సెలబ్రిటీలను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతోపాటు తమ అవసరాలను తీర్చుకున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుండి ప్రత్యేకంగా పరికరాలు తెప్పించారన్నారు.
Read also: నైట్ షిఫ్ట్ చేస్తున్నారా..? సంతాన సమస్యలు ఖాయం
బీఆర్ఎస్ ఓడిపోయాక ఫోన్ ట్యాపింగ్ పరికరాల ధ్వంసం పేరుతో దేశ భద్రతకు, ఉగ్రవాదులకు సంబంధించిన కీలకమైన సమాచార డేటాను కూడా ధ్వంసం చేశారన్నారు. వ్యాపార సంస్థలు ప్రతిపక్షాలకు విరాళాలు ఇవ్వకుండా ఫోన్ ట్యాపింగ్ ను వాడుకున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నా ఎందుకు స్వదేశానికి రప్పించలేకపోయారన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై వాస్తవాలు నిగ్గు తేలాలంటే సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు జోక్యం అనివార్యం అన్నారు. మీరే సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయండన్నారు.
రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రతిపక్షాలపై సైబర్ దాడికి కారకుడైన మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ లకు నోటీసులిచ్చి విచారణ జరిపి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగ హక్కులనే ఉల్లంఘించిన కేసీఆర్ ను, కేటీఆర్ లు ఎమ్మెల్యే పదవులకు అనర్హులు అని తెలిపారు. తెలంగాణ శాసనసభా నాయకుడిగా ఉన్న మీరు కేసీఆర్, కేటీఆర్ లను అనర్హులుగా ప్రకటించే విషయంపై స్పీకర్ కు లేఖ రాయాలన్నారు.
Ponguleti Srinivasa Reddy: పాలేరుకు సీసీ రోడ్డు ఇచ్చే బాధ్యత నాదే..