NTV Telugu Site icon

Bandi Sanjay : సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ..

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో.. పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలు చేయడంతోపాటు వారి సర్వీస్ ను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదని ఆయన అన్నారు. పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ మొదలు దోమల నివారణ దాకా పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివని ఆయన అన్నారు.

పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ గూండాల దాడులు చేయడం బాధాకరమని, ఉన్నతాధికారుల వేధింపులు పంచాయతీ కార్యదర్శులపై నిత్యకృత్యంగా మారడం దారుణమన్నారు. పంచాయతీ కార్యదర్శుల్లో మనోధైర్యం నింపి ఉద్యోగ భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. కచ్చితమైన పని గంటల నిర్ణయించడంతోపాటు వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు.