Site icon NTV Telugu

ప్రధాని మోడీని కలిసిన బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌… ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.. ఇవాళ ఓబీసీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సభ్యులతో కలిసి ప్రధాని చెంతకు వెళ్లారు బండి సంజయ్.. జాతీయస్థాయి వైద్య విద్యా కోర్సుల్లో ఓబీసీలకు 27 శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొంటూ ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత 40 ఏళ్లలో ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ఓబీసీలంతా మీకు రుణపడి ఉంటారు. దేశ ప్రజలు మిమ్ముల్ని ఎన్నటికీ మర్చిపోరు అని ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్..

ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలు, పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లాలని ఎంపీలకు సూచించారు. అయితే, ఈ భేటీ సందర్భంగా బండి సంజయ్ ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా పలకరించారు.. ఓవైపు ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందిస్తున్నారు బండి సంజయ్‌.. ఆయన ఆధ్వర్యంలో దుబ్బాక అసెంబ్లీలో స్థానంలో విజయం సాధించడం.. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇక, పలువురు సీనియర్‌ నేతలు బీజేపీలో చేరడానికి ఆయన పావులు కదుపుతూ.. పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపుతూ.. అధిష్టానం దృష్టిని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version