Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించిన బండి సంజయ్‌కు అదిష్టానం మరో కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ జాతీయ కార్యవర్గంలో సంజయ్‌కు స్థానం కల్పించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరిట ఓ ప్రకటన విడుదలైంది. ఇటీవల పలు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ తొలగించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ అధ్యక్షులను కూడా తొలగించారు. బీజేపీ అధ్యక్ష పదవుల నుంచి తొలగించిన వారిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించింది. జాతీయ కార్యవర్గంలో తెలంగాణ, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, సోము వీర్రాజుకు చోటు దక్కింది. శనివారం రాత్రి బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి 10 మందిని చేర్చుకుంటున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, బీహార్, పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్ మాజీ అధ్యక్షులు బండి సంజయ్, సోమువీర్రాజు, సురేష్ కశ్యప్, సంజయ్ జైశ్వాల్, అష్మినీ శర్మ, దీపక్ ప్రకాష్, సతీష్ పునియా చోటు చేసుకున్నారు.
Read also: Rajinikanth: జైలర్ తెలుగు ప్రమోషన్స్ లైట్ తీసుకున్నారా?
ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలు విష్ణుదేవ్ సాయి, ధరమ్ లాల్ కౌశిక్, కిరోదిలాల్ మీనాలకు కూడా బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఇటీవల బీజేపీ అధ్యక్షులు మారిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవులు కోల్పోయిన బండి సంజయ్, సోము వీర్రాజులకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. తాజాగా తెలంగాణ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా జాతీయ కార్యవర్గంలోకి చేరారు. అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా మరో నేత ఈటల రాజేందర్‌ను నియమించారు. ఇలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతలకు నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగిస్తోంది.