Site icon NTV Telugu

Bandi Sanjay: కేంద్ర నిధులతో ప్రారంభోత్సవాలు.. సిగ్గులేదా?

స్మార్ట్ సిటీ పేరుతో కేంద్రం ఇచ్చిన నిధులతో కరీంనగర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తోందని, టీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా మళ్లీ కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని విమర్శలు చేస్తోందని మండిపడ్డారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ లో నిన్న ప్రారంభోత్సవం చేసిన నిధులు ఎక్కడి నుండి వచ్చాయో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నిన్న టీఆర్ఎస్ నాయకులు సభలో ఏది మాట్లాడినా నడుస్తుందనుకుని సిగ్గులేకుండా వ్యవహరించారు. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి ‘ప్రసాదం’ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ప్రతిపాదనలు పంపలేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా స్పందన లేదు.

నేను ఏమీ చేయలేదని టీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్దాలు చెబుతూ డ్రమ్ములో రాళ్లేసి సౌండ్ చేసినట్లు ఒర్లుతున్నారు. అయినా ఆ కుటుంబమే (కేసీఆర్) అటువంటిది. ఏది పడితే అది మొరగడం వాళ్లకు అలవాటైంది. అసలు తెలంగాణకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పకుండా కేంద్రంపై ఏడ్వటం సిగ్గు చేటు. మతపిచ్చి లేపుతున్నానని చెబుతున్న వాళ్లకు… నేను సగర్వంగా హిందువనని చెప్పకుంటానన్నారు. హిందువులు రెచ్చగొడితే రెచ్చిపోయేటోళ్లు కాదు. ఎంఐఎం కోసం మైనారిటీ సంతుష్ట విధానాలను అవలంభించే మీలాంటోళ్లకు బుద్ది చెబుతాం.

ఎంపీగా అడ్డిమార్ గుడ్డిసూట్ లో గెలిచారనే ఆరోపణలు చేస్తున్న వాళ్లు నన్ను కరీంనగర్ ప్రజలు లక్ష ఓట్లతో గెలిపించిన సంగతి గుర్తుంచుకోవాలి. టీఆర్ఎస్ గెలిచేందుకు వంద కోట్లు ఖర్చు పెట్టినా ఆ పార్టీ అభ్యర్ధిని ఓడించిండ్రు. అందరూ కలిసినా బీజేపీని ఏమీ చేయలేకపోయిండ్రు. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని గెలిచేది మీరే. నీ అయ్యతోసహా మీరంతా తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని గెలిచిండ్రు. కానీ నీ అయ్య తెలంగాణ బిల్లు ఓటింగ్ లో పాల్గొనలేదు. సీఎం అయ్యాక నీటి వాటాలో తెలంగాణకు అన్యాయం చేసిండు. ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటుండు. డీపీఆర్ పంపకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎట్లా ఇస్తారు? ఏది పడితే అది మొరిగితే.. జనం వాత పెడతారని టీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు బండి సంజయ్. గంగులపై పోటీ చేయాలంటూ తూట్ పాలిష్ గాళ్లు చెప్పే మాటలను పట్టించుకునేదెవరు?

టీఆర్ఎస్ కు భయం పట్టుకుంది. హిందుత్వం, బీజేపీ, కాషాయం అంటేనే వణుకు మొదలైంది. అందుకే టీఆర్ఎస్ సభను అడ్డుకుంటామనే భయంతో బీజేపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేసిండ్రు సిగ్గు లేకుండా… అడ్డుకోవాలనే నీచ సంస్కృతి మాత్రం మాకు లేదు. బీజేపీ అంటే భయంతోనే వాళ్లు అరెస్టు చేస్తుండ్రు. టీఆర్ఎస్ లెక్క బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదు. జాతీయ పార్టీ. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే దానిపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక ఎవరైనా సరే దానికి కట్టుబడి ఉండాల్సిందే. దాని ప్రకారమే బండి సంజయ్ అయినా.. ఇంకెవరైనా పోటీ చేయాల్సిందే.. పనిచేయాల్సిందే అన్నారు బండి సంజయ్.

https://ntvtelugu.com/darshans-will-start-from-march-28-in-yadadri/
Exit mobile version