NTV Telugu Site icon

Bandi Sanjay: కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష?

Bandi Sanjay

Bandi Sanjay

గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాహితులపై కేసీఆర్‌ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష? అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జిని ఆయన ఖండించారు. అర్ధరాత్రి సమయంలో గుడాటిపల్లికి వెళ్లి బాధిత నిర్వాసితులను పరామర్శించారు బండి సంజయ్‌. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్వాసితులపై మరోసారి లాఠీఛార్జ్ జరిగింది. హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీష్ కుమార్‌ క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడించేందుకు భూ నిర్వాసితులు ప్రయత్నించారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. హుస్నాబాద్‌ బస్టాండ్‌ దగ్గర్లో ధర్నాకు దిగారు. ధర్నా సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, భూ నిర్వాసితులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఘర్షణలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘర్షణలో ఏసీపీ కూడా గాయపడ్డారు.

Read Also: Presidential Election: హస్తినలో కీలక మీటింగ్‌.. ఆసక్తికర చర్చ..

కాగా, సోమవారం తెల్లవారుజామున గుడాటిపల్లి వాసులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా ఆందోళనలు కొనసాగాయి. తమకు పరిహారం ఇవ్వకుండా సర్వే చేయడానికి వీల్లేదంటూ ఆందోళనలు చేస్తున్న గౌరవెల్లి రిజర్వాయరు నిర్వాసితులపై పోలీసులు బలప్రయోగానికి దిగారు. కరెంట్ సప్లై ఆపేసి, అర్ధరాత్రి ఇళ్లలోకి దూరి ఆందోళనల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఆడ మగా తేడా లేకుండా చావబాదారు. నిర్వాసితులపై పోలీసుల దాడిని నిరసిస్తూ హుస్నాబాద్‌ బంద్ నిర్వహించింది కాంగ్రెస్. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కూడా బంద్‌లో పాల్గొన్నారు. లాఠీఛార్జిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు జీవన్ రెడ్డి. అటు గౌరవెల్లి నిర్వాసితులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పరామర్శించారు. అర్ధరాత్రి సమయంలో అక్కడికి వెళ్లిన ఆయన… నిర్వాసితులను కలిసి ధైర్యం చెప్పారు. న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.