హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనంపై ఇప్పుడు అధికార టీఆర్ఎస్.. ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేల్చుతోంది… వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో కేసీఆర్ సర్కార్ తీరుపై సీరియస్ గా ఉంది బీజేపీ.. రేపు మధ్యాహ్నం వినాయక సాగర్ వెళ్లనున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నిమజ్జనానికి ఏర్పాట్లు చేయకపోతే ఏం చేయాలో హిందువులకు తెలుసు అని హెచ్చరిస్తున్నారు.. హిందువుల సహనాన్ని పిరికితనంగా భావిస్తారా? హిందూ పండుగలంటే అంత చులకనా? అని ప్రశ్నించిన ఆయన.. తక్షణమే వినాయక్ సాగర్ నిమజ్జన ఏర్పాట్లు చేయండి.. లేనిపక్షంలో ఏం చేయాలో మాకు తెలుసు అన్నారు.. సర్కార్ తీరుకు నిరనసగా రేపు ఉదయం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు సంజయ్.
Read Also: Heavy Rains: మళ్లీ దంచికొడుతున్న వానలు.. మరో 4 రోజులు భారీ వర్షాలు..
గణేష్ నిమజ్జన ఉత్సవాలకు వినాయక్ సాగర్ లో ఇప్పటి వరకు ఏర్పాట్లు చేయకపోవడం దుర్మార్గం. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తుండటం సిగ్గు చేటు అని సర్కార్‌పై మండిపడ్డారు బండి సంజయ్.. హిందువుల పండుగలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంత చులకన ఎందుకు? మూడు రోజుల నుండి అడుగుతున్నా కనీసం స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం సిగ్గు చేటు అని మండిపడ్డారు.. ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలంటూ ర్యాలీ చేసిన భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులను అరెస్ట్ చేయడం అన్యాయం. వినాయక సాగర్ వద్ద ఏర్పాట్లు చేయకపోతే హిందువులంతా గణేష్ నిమజ్జనం ఎక్కడ చేసుకోవాలి? అని నిలదీశారు.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలి. వినాయక్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. హిందువుల సహనాన్ని పిరికితనంగా భావించొద్దు. ఏర్పాట్లు చేయకపోతే ఏం చేయాలో హిందువులకు తెలుసు అని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.