Site icon NTV Telugu

Bandi Sanjay : కేసీఆర్‌ సర్కార్‌ ప్రగల్భాలు పలికింది.. కానీ..

Bandi Sanjay

Bandi Sanjay

మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌పై విమర్శల గుప్పించారు. మంగళవారం ఆయన ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించి, ఖర్చు చేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికిందని ఆయన మండిపడ్డారు. 2017-18 నుండి 2021-22 వరకు ఎంబీసీ కార్పోరేషన్‌కు బడ్జెట్‌ కేటాయింపులకు ఖర్చుకు అసలు పొంతనే లేదని ఆయన వెల్లడించారు. ఎంబీసీలకు గడిచిన నాలుగు బడ్జెట్‌లలో 3 వేల కోట్లు కేటాయించినట్లు కాగితాల్లో కనిపిస్తున్నా ఫైనాన్స్‌ విభాగంలో ఆమోదం పొందింది రూ.350 కోట్లు కాగా కనీసం 10 కోట్లు కూడా ఖర్చు చేయలేదు (వాస్తవఖర్చు 7.10 కోట్లు) అని ఆయన తెలిపారు. ప్రస్తుతమున్న 36 కులాలు కాక మరో 15 కులాలవారు తమను ఎంబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారన్నారు. వీరి అభ్యర్థనను పరిశీలించి వెంటనే పరిష్కారం చూపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత తెస్తామని 2017లో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ చేసిన హామీ నేటికీ అమలుకాలేదని ఆయన విమర్శించారు. 2017లో బీసీ మంత్రులు, బీసీ ప్రజాప్రతినిధులు మూడు రోజులు సమావేశమై 210 తీర్మానాలను ఆమోదించి ప్రభుత్వానికి అందజేశారన్నారు.

ఈ తీర్మానాలకు ఇప్పటి వరకు అతీగతీ లేదని, 2017లో బీసీ సబ్‌ప్లాన్‌ అమలుపై కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమలై ఉంటే బీసీ సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులకు మరో 10 వేలకోట్ల నిధులు అదనంగా సమకూరేవని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి రాష్ట్రబడ్జెట్‌లో బీసీలకు 2, 3 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని ఆయన మండిపడ్డారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో 146 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని అందుకు 73 ఎకరాలభూమి 53 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు బుట్టదాఖలా చేశారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 18శాతానికి కుదించారని. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారన్నారు.

జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్ర మంత్రి వర్గంలో కనీసం 8 మంది బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలన్నారు. మోడీ క్యాబినెట్‌లో 27 మంది బీసీలకు స్థానం కల్పించారని ఆయన గుర్తు చేశారు. 12 మంది ఎస్సీలకు, 8 మంది ఎస్టీలను క్యాబినెట్‌ మంత్రులను చేసి అట్టడుగు వర్గాలవారికీ సముచితమైన గౌరవాన్ని ఇచ్చారన్నారు. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 338 బి, 342 ఏ, 366 (26 ఏ) అధికరణను చేరుస్తూ జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీదేనని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version