NTV Telugu Site icon

Bandi Sanjay: బండి సంజయ్‌కి BJP కీలక బాధ్యతలు.. కిసాన్ మోర్చా ఇంఛార్జ్‌గా నియామకం

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. బండి సంజయ్ ను కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తన సంస్థాగత విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. కీలక శాఖలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఇందులో బండి సంజయ్ కుమార్, సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ సహా పార్టీ సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జి బండి సంజయ్ కుమార్, యువమోర్చా ఇన్‌ఛార్జ్ సునీల్ బన్సాల్, ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, మహిళా మోర్చా ఇన్‌ఛార్జ్ బైజ్యంత్ జె పాండా, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జ్ డాక్టర్ రాధా మోహన్‌దాస్ అగర్వాల్, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) మోర్చా ఇంచార్జీగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్చార్జిగా దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను నియమించినట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.

Read also: Telangana Government: కాంగ్రెస్ మరో హామీ..! నెలాఖరులోగా అమలుకు కసరత్తు..

2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఈ మేరకు పార్టీలో మార్పులు చేసింది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రకటించారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించారు. దీంతో సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పట్లో ఆయనకు కేంద్రమంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ పార్టీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. సంజయ్ తో పాటు కీలక నేతలు ఎమ్మెల్యేలుగా ఓడిపోయారు. సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందన్న వాదన తెరపైకి వచ్చింది. సంజయ్ ఎన్నికలకు వెళ్లి ఉంటే.. బీజేపీ కనీసం 30 సీట్లు గెలిచి ఉండేదని.. ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ గా ఉండేదని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనకు ఆ నష్టాన్ని పూడ్చేందుకు కిసాన్ మోర్చా ఇన్ చార్జిగా కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
Land Grabbing: భూ కబ్జా కేసులపై ఫోకస్‌ పెట్టిన సీపీ.. పీడీ యాక్ట్‌, అవసరమైతే నగర బహిష్కరణ..!