రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సమస్యను తెలంగాణలో కేసీఆర్ సృష్టిస్తున్నాడని, నష్టపోయిన రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. తూతూ మంత్రంగా చర్యలతో తప్పించుకుంటాం అంటే.. వదిలే ప్రసక్తే లేదని, కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేస్తే ఊరుకోమని ఆయన వ్యాఖ్యానించారు. నీ దుష్ట, మూర్ఖపు, నీచమైన పాలనలో ఈ ఏడేళ్లలో ఏనాడు రైతన్నను ఆదుకోలేదని, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. ఫసల్ బీమా యోజన అమలు చేయడు…బోనస్సులు ఇవ్వడు.. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమంటే తగ్గించడు అంటూ కేసీఆర్‌పై బండి సంజయ్ ఆరోపణలు గుప్పించారు.
ఎక్కడ డీజిల్ ధర తక్కువ ఉంటే.. అక్కడే తీసుకోమని నీ ఆర్టీసీనే ఆదేశాలు ఇచ్చిందని, కర్ణాటకలో రూ.15 వరకు తక్కువ ఉంది.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ ఉన్నాయని ఆర్టీసీ ఇచ్చిన లేఖతో స్పష్టమైందన్నారు. ఆర్టీసీ కార్మికులకు హ్యాట్సాఫ్… మీరు వాస్తవ విషయాలను ప్రజలకు తెలియజేసినందుకు.. రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడదాం…. కలిసి రైతన్నలను ఆదుకుందామన్నారు. కేసీఆర్ కు ఎడమ, కుడి వైపు బల్లాలు, బరిసెలు పట్టుకుని తంతం అన్నవాళ్లే ఉన్నారని, నిజమైన ఉద్యమకారులు తెరమరుగయ్యారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీని సంకలో వేసుకుని తిరుగుతాడు కేసీఆర్ అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తీరుతో ఉద్యమకారులు ఆత్మలు ఘోషిస్తున్నాయని, తెలంగాణ తల్లిని బంధవిముక్తిరాలిని చేస్తాం… ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నామన్నారు. అంతేకాకుండా.. నీతి నిజాయితీతో కూడిన పాలన అందించేది బీజేపీనేనని, తెలంగాణలో ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నానని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.