Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్‌లో కీలక డిమాండ్లు

  • SIR, ఫార్మ్-7పై ఒవైసీ తీవ్ర అభ్యంతరాలు
  • ముస్లిం ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ
  • ఒడిశాలో తెలంగాణ తోలు వ్యాపారుల సమస్యపై సీఎస్‌కు విజ్ఞప్తి
  • ఎల్‌నినో ప్రభావంపై సమగ్ర నివేదికకు సీఎస్ ఆదేశాలు
Asaduddin Owaisi

Asaduddin Owaisi

రాష్ట్రంలో ముస్లిం ఓట్లను పథకం ప్రకారం తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. సచివాలయంలోని మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎలక్షన్ కమిషన్‌లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు ఎన్నికల కమిషన్‌కు, భారతీయ జనతా పార్టీకి ఉన్న సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఒక నిర్దిష్ట సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎంపిక ప్రక్రియే సరైన విధానంలో జరగలేదని విమర్శించిన ఒవైసీ, ప్రస్తుత ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) పేరుతో వెనుక తలుపు గుండా ఎన్ఆర్సీ (NRC) ని తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఒడిశాలో తోలు వ్యాపారుల ఆవేదన.. సీఎం జోక్యానికి విజ్ఞప్తి

రాష్ట్రంలోని తోలు వ్యాపారులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై కూడా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. తెలంగాణ నుంచి మేకలు, బర్రెలు, ఆవుల తోలును సేకరించి ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు రవాణా చేస్తూ చట్టబద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నారని, ప్రభుత్వానికి క్రమం తప్పకుండా 5 శాతం జీఎస్‌టీ చెల్లిస్తున్నారని గుర్తుచేశారు. అయినప్పటికీ, గత ఆరు నెలలుగా ఒడిశాలో తెలంగాణకు చెందిన తోలు ట్రక్కులను అన్యాయంగా నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాపారంపై దాదాపు 10,000 మంది జీవనం సాగిస్తున్నారని, లారీలను అడ్డుకోకుండా ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా ఒడిశా సీఎంతో మాట్లాడి తోలు వ్యాపారుల లారీలను విడిపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎల్‌నినో కరువు పరిస్థితులపై సమగ్ర నివేదికకు సీఎస్ ఆదేశం

మరోవైపు, రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తిన వర్షాభావం, కరువు పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులపై పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. అక్టోబర్ మాసాంతంలోగా ఎల్‌నినో ప్రభావం, పంట నష్టం, తాగు నీటి ఎద్దడి తదితర అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించాలని సంబంధిత శాఖలకు సీఎస్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.