Site icon NTV Telugu

Asaduddin Owaisi: ఒక ఉప ఎన్నిక కోసం.. ఇంత బరితెగించాలా?

Asaduddin Owaisi Twitter

Asaduddin Owaisi Twitter

Asaduddin Owaisi Fires On BJP For Creating Rucks In Hyderabad: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల హైదరాబాద్ నగరంలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే! ఈ పరిస్థితులపై తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. కేవలం ఒక ఉప ఎన్నికల (మునుగోడు) కోసం.. బీజేపీ ఇంతలా బరితెగించాలా? అంటూ మండిపడ్డ ఆయన.. ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇంకెంతలా ఉంటుందోనని సందేహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అగ్ని ఆహుతి చేద్దాం అనుకుంటున్నారా? అంటూ బీజేపీని ప్రశ్నించారు. దుకాణాళ్లు, పాఠశాలలు మూయించి.. ప్రజలను ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా చేసి, కర్ఫ్యూ సృష్టించాలని బీజేపీ అనుకుంటోందని అభిప్రాయపడ్డారు. అల్లా దయతో ఇవన్ని జరగకూడదని కోరిన అసదుద్దీన్.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ సృష్టిస్తోన్న హింసకాండ నుంచి విముక్తి పొందాలని ఆశిద్దామని అన్నారు.

అంతకుముందు.. రాజాసింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలకు గాను కేసులు నమోదు చేసి, ఆయన్ను జైలుకు పంపాలని ఒవైసీ డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రశాంత వాతావరణం ఉండేదని.. ఇప్పుడు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల కారణంగా పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వల్లే ప్రశాంతంగా ఉన్న నగరంలో అశాంతి నెలకొందని ఆరోపించారు. భవిష్యత్తులో రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే.. అతనిపై కేసులు నమోదు చేసి, తప్పకుండా జైలుకి పంపాల్సిందేనన్నారు. ఓ ప్రజా ప్రతినిధి అయ్యుండి.. రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.

Exit mobile version