Site icon NTV Telugu

Rain Alert : వదలా అంటున్న వానలు.. ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలే..!

Telangana Rains Update

Telangana Rains Update

Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను వరుణుడు ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. మొన్నటి వాయుగుండం ప్రభావం పూర్తిగా తగ్గక ముందే.. మరో అల్పపీడనం కదలికలు ప్రారంభించింది. ఇది వాయుగుండంగా మారే అవకాశముందని, వచ్చే నాలుగు రోజులపాటు రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు తప్పవని వాతావరణశాఖ హెచ్చరించింది.

గత కొన్ని నెలలుగా ఏపీ, తెలంగాణలో వర్షాలే ప్రధాన సమస్యగా మారాయి. కాలం మారినా వానలు మాత్రం ఆగడంలేదు. కొన్నిచోట్ల కుండపోతగా కురుస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలోని వాయుగుండం కారణంగా రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.

Union Cabinet: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి గురువారానికి వాయుగుండంగా బలపడనుంది. శుక్రవారం ఉదయానికి ఇది దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాలను తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని అంచనా. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఏలూరు, కృష్ణా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణలోనూ మూడు నుంచి నాలుగు రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, గురువారం, శుక్రవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగ కానుక.. పెరుగనున్న డీఏ..

Exit mobile version