యాదాద్రి లో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. యాదాద్రి లో రేపు జరగనున్న మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రధానాలయంలో భక్తులకు స్వయంభూ లక్ష్మీనరసింహుడు దర్శనమివ్వనున్నాడు. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధానాలయంలో సాధారణ భక్తులకు దర్శనం మొదలుకానుంది. దీంతో యాదాద్రి కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం లో భాగంగా సీఎం కేసీఆర్ 12 వందల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వం నిధులతో యాదాద్రి పునర్నిర్మాణం చేశారు. రేపు జరగనున్న మహా సంప్రోక్షణ మహోత్సవానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.యాదాద్రి ఆలయ మహా సంప్రోక్షణ మహోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. యాదాద్రిలో కార్యక్రమాలు సజావుగా సాగడానికి పోలీస్, రెవెన్యూ, వైద్యారోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవానికి మూడు వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. 400 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించనున్నారు. సీఎం కేసీఆర్ తో సహా ప్రముఖులు సంప్రోక్షణ మహోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ఆక్టోపస్, గ్రేహౌండ్ బలగాలను కూడా రంగంలోకి దించుతున్నారు. కొండపై కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. యాదాద్రి ప్రధానాలయం పునర్నిర్మాణం దృష్ట్యా 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు.. నేటితో బాలాలయంలో భక్తులకు దర్శనాలు ముగియనున్నాయి.యాదాద్రి ఉద్గాటన నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 7 రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహిస్తున్నారు.
108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువును నిర్వహిస్తున్నారు.. రేపు ఉదయం 11.55 గంటలకు నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వయంభువుల దర్శనభాగ్యం కల్పించనున్నారు. మహా పూర్ణాహుతి అనంతరం ఉత్సవ మూర్తులను శోభాయాత్రతో ప్రధానాలయంలోకి తీసుకొస్తారు. ఆలయ గోపురాలకు మహాకుంభ సంప్రోక్షణ అనంతరం కలశాలను బిగించి, ప్రధానాలయంలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పిస్తారు. సీఎం కేసీఆర్ మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొని స్వయంభువులను దర్శించుకొంటారు. ఈ కార్య్రమానికి అందరూ ఆహ్వానితులేనని, ప్రత్యేక ఆహ్వానాలు ఏమీ లేవని అంటున్నారు అధికారులు. 29 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తారు.
