Site icon NTV Telugu

Additional CP Srinivas Interview : ఐ-బొమ్మ రవి పైరసీ చేయడానికి ఆమె కారణమా..?

Bomma

Bomma

Additional CP Srinivas Interview : ఐ-బొమ్మ రవిని పట్టుకున్న హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, రవి పైరసీ సామ్రాజ్యాన్ని స్థాపించడం వెనుక ఉన్న వ్యక్తిగత కారణాలు, అతడి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ఈ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. రవికి ఎదురైన అవమానం మరియు తక్షణ ధనం సంపాదించాలనే కోరిక అతడిని ఈ మార్గాన్ని ఎంచుకునేలా చేసిందని సీపీ వివరించారు.

రవి ఏనాడూ సంప్రదాయ ఉద్యోగాల కోసం ప్రయత్నించలేదని, క్విక్ మనీ సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని సీపీ తెలిపారు. అయితే, దీని వెనుక వ్యక్తిగత అంశాలు కూడా ఉన్నాయని, తన కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కల వారు ఎవరో తనను బాగా అవమానించినట్లు (నీవేం పనికి వస్తావు అని రెచ్చగొట్టినట్లు) రవి విచారణలో చెప్పాడని పేర్కొన్నారు. ఈ అవమానానికి ప్రతీకారంగా, “నేనేం చేసి చూపిస్తాను చూడు” అని స్వయంగా నిర్ణయించుకుని, సింగిల్ షాట్‌లో బిగ్ షాట్గా పేరు తెచ్చుకోవాలనే లక్ష్యంతో రవి ఈ పైరసీ రంగంలోకి అడుగుపెట్టినట్లు కమిషనర్ వెల్లడించారు.

రవి కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా, సౌత్ ఇండియాతో పాటు ఇంగ్లీష్ సినిమాలను కూడా పైరసీ చేయగలిగే సాంకేతిక సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతని దగ్గర మొత్తం 21,000 సినిమాలు ఉన్నాయని, పాత సినిమాలతో మొదలుపెట్టి క్రమంగా ఈ భారీ సినిమా బ్యాంక్‌ను తయారు చేసుకున్నాడని తెలిపారు. ఈ డేటాను లాప్‌టాప్‌లలో కాకుండా, 2 టెరాబైట్, 5 టెరాబైట్ వంటి హార్డ్ డిస్కుల్లో మరియు రక్షణ కోసం వివిధ దేశాలలో హైర్ చేసుకున్న క్లౌడ్ సర్వీసుల్లో కూడా నిల్వ చేశాడని వివరించారు.

Off The Record: అనర్హత విషయంలో తనదైన శైలిలో పావులు కదిపిన దానం

రవి పైరసీ వెబ్‌సైట్‌ను ఆపరేట్ చేయడానికి మరియు పట్టుబడకుండా ఉండేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాడని సీపీ వివరించారు. ఐ-బొమ్మ డొమైన్ తీసుకున్న తర్వాత, సర్వర్లను రక్షణ కోసం నెదర్లాండ్, స్విట్జర్లాండ్‌ వంటి విదేశాలలో హైర్ చేసుకున్నాడు. తన పనిని పూర్తి చేయడానికి, కరేబియన్ దీవుల్లో ఉన్న కొందరు సాఫ్ట్‌వేర్ ఏజెన్సీలకు డబ్బు చెల్లించి తనకు కావాల్సిన పనులను చేయించుకున్నాడని, ఇలాంటి టెక్నికల్ సాయం అందించే కంపెనీలు డార్క్ వెబ్‌లో చాలా ఉన్నాయని పేర్కొన్నారు.

సాంకేతిక నేరాల భవిష్యత్తు గురించి మాట్లాడుతూ, త్వరలో రాబోతున్న వెబ్ 3.0 వెర్షన్ ద్వారా నేరాలను పట్టుకోవడం మరింత కష్టమవుతుందని సీపీ హెచ్చరించారు. వెబ్ 3.0 వచ్చిన తర్వాత డేటా ఎన్‌క్రిప్షన్ అవుతుందని, దాంతో దాన్ని డీక్రిప్షన్ చేయడం చాలా కష్టమవుతుందన్నారు. ఐపీ అడ్రస్‌లను కూడా మాస్కింగ్ చేసి, నిందితులు ఒకచోట ఉండి ఇంకో దేశం నుంచి మాట్లాడుతున్నట్టుగా సాఫ్ట్‌వేర్ ద్వారా జంప్ చేయించవచ్చని, సాఫ్ట్‌వేర్ అనేది చాలా విస్తృతమైన ప్రపంచమని ఆయన ముగించారు.

Off The Record: జగిత్యాల కాంగ్రెస్‌లో జీవన్‌రెడ్డి వర్సెస్‌ సంజయ్‌

Exit mobile version