తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ.. విభేదాలు పక్కనబెట్టి.. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కలిసికట్టుగా పనిచేస్తామని నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.. మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిలపై సోనియాకు ఫిర్యాదు చేశారు.
Read Also: Malladi Vishnu: సీఎం నిర్ణయం శిరోధార్యం.. 2024లో మళ్లీ అధికారమే లక్ష్యం..
తుంగతుర్తి నియోజక వర్గంలో డాక్టర్ రవిని కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారంటూ తన లేఖ ద్వారా సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు అద్దంకి దయాకర్.. 2018 ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీకి మద్దతు ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్పినా.. డాక్టర్ రవి పోటీ చేసి పార్టీకి నష్టం చేశారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.. టీఆర్ఎస్‌కి లాభం చేకూర్చే పనులే చేస్తున్న రవిని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డిలు మళ్లీ పార్టీలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు అద్దంకి దయాకర్.
