NIMS Corruption : నిమ్స్‌లో అవినీతిపై ఉక్కుపాదం.. ఒకేసారి మూడు శాఖల తనిఖీలు!

Nims Raids

Nims Raids

రాష్ట్రంలోనే ప్రతిష్ఠాత్మక నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో వేళ్లూనుకున్న అవినీతిపై అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలకు చెందిన అధికారులు గురువారం ఏకకాలంలో ఆసుపత్రి ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఒకేసారి మూడు కీలక శాఖల అధికారులు రంగంలోకి దిగడంతో నిమ్స్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.

లక్ష్మీభాస్కర్ కేసుతో బట్టబయలైన లీలలు
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ అవినీతి కేసు విచారణలో లభించిన కీలక ఆధారాలు, లింకుల ఆధారంగానే ఏసీబీ ఈ సోదాలు చేపట్టింది. ఆసుపత్రిలోని మెడికల్ స్టోర్స్, సర్జికల్ స్టోర్స్, క్యాంటీన్ల నిర్వహణ నుంచి కీలక స్థానాల్లో ఉన్న కొందరు ఉన్నతాధికారులకు ఏటా భారీగా ముడుపులు అందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్క క్యాంటీన్, మందుల దుకాణాల నుంచే ప్రతి ఏటా సుమారు రూ.50 లక్షల మేర లంచాల రూపంలో చేతులు మారుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యమయ్యాయి.

రికార్డుల జల్లెడ.. ముమ్మర సోదాలు
సుమారు పది మంది ఏసీబీ అధికారుల బృందం నిమ్స్ పరిపాలనా విభాగాన్ని (అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్) తమ ఆధీనంలోకి తీసుకుని సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అనుమతులు, టెండర్లు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన కీలక దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.

మరోవైపు, రోగులు, వారి బంధువులకు నాణ్యతలేని ఆహారాన్ని విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు చెందిన నాలుగు ప్రత్యేక బృందాలు నిమ్స్ క్యాంటీన్‌లో విస్తృత తనిఖీలు చేపట్టాయి. ఆహార పదార్థాల నాణ్యత, వంటగది పరిశుభ్రత, నిల్వలను పరిశీలించి శాంపిళ్లను సేకరించాయి. అదే సమయంలో, ఆసుపత్రిలోని సర్జికల్ స్టోర్‌లో నలుగురు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల బృందం తనిఖీలు చేపట్టింది. రోగులకు సరఫరా చేస్తున్న సర్జికల్ పరికరాలు, ప్రాణరక్షక ఔషధాల నిల్వలు, వాటి కొనుగోలు రికార్డులు, గడువు ముగిసిన మందుల అంశాలపై ఆరా తీస్తున్నారు. ఆసుపత్రిలో అవినీతికి పాల్పడుతూ నిబంధనలను తుంగలో తొక్కుతున్న అధికారుల జాబితాను ఏసీబీ సిద్ధం చేస్తోంది. ఈ సోదాల అనంతరం నిమ్స్‌లోని పలువురు కీలక అధికారులపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.