NTV Telugu Site icon

Indravelli incident: మాయని ఇంద్రవెల్లి గాయాలు.. మారణకాండకు 42ఏళ్లు

Indravelli

Indravelli

Indravelli incident: ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఇవాల నిర్వహించేందుకు ఆదివాసీ గిరిజనులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమైక్య పాలకుల నిరంకుశ పాలనలో నివాళులు అర్పించేందుకు కూడా వీలులేని ఈ ప్రాంత ప్రజలు నేడు స్వచ్ఛందంగా అమర వీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ప్రతి ఏటా ఏప్రిల్ 20న అమరవీరుల స్థూపం వద్ద 144 సెక్షన్ విధించిన పోలీసులు, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కాస్త సడలించడంతో గిరిజనులు గుమిగూడి చేదు ఘటనను గుర్తు చేసుకున్నారు.

అసలేం జరిగింది..?

హక్కుల కోసం ఉద్యమిస్తున్న అడవిబిడ్డలపై అప్పటి ప్రభుత్వం తుపాకీ గురిపెట్టి తూటాల వర్షం కురిపించింది. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పలువురు గిరిపుత్రులు చనిపోయారు. రక్తపు మరకలు ఇప్పటికీ కొట్టుకుపోలేదు. ఈ ఘటనతో ఇంద్రవెల్లి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. నాడు వ్యాపారులు, అధికారుల చేతుల్లో దోపిడికి గురైన గిరిజనం ఉద్యమానికి సిద్ధమైంది. దీంతో గిరిజన గ్రామంలో పోలీసుల బూట్ల చప్పుడు మొదలైంది. ఈనేపథ్యంలో గిరిజన సంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. ఈ క్రమంలో అడవుల్లోని ఖాళీ భూముల్లో గిరిజనులు దున్నేందుకు పూనుకున్నారు. అయినా అప్పటి ప్రభుత్వం స్పందించకపోవడంతో 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో పలు సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. నాటి ప్రభుత్వం ఇందుకు అనుమతించలేదు. అయినా గిరిజన సంఘాలు వెనక్కి తగ్గలేదు. రైతు సంఘాలు నిర్వహించిన సభకు ఆనాటి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సభకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఇదేమీ తెలియని ఆదివాసీలు సభకు భారీగా తరలివచ్చారు. సభను అడ్డుకునేందుకు నాటి పోలీసులు తమ శాయశక్తులా ప్రయత్నించారు. వాహనాలను అడ్డుకునేందుకు రోడ్లను దిగ్బంధించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే ఓ గిరిజన యువతితో ఓ జవాన్ అసభ్యంగా ప్రవర్తించాడు.

Read also: Marriage Age: పాతికేళ్లు వచ్చినా పెళ్లి ముచ్చటే లేదు.. అమ్మాయిలూ ఎదిగారు

ఆ యువతి తనపై అకారణంగా చేయి వేశాడని కొడవలితో వేటు వేసింది. అంతే జవాన్ కిందపడిపోయాడు. ఇంతలో పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు తుపాకీలను ఆశ్రయించారు. తుపాకుల మోతతో ఇంద్రవెల్లి వణికిపోయింది. పచ్చని చెట్లు ఎర్రగా మారాయి. గోండుల రక్తం భూమిపై చిందేసింది. వందలాది మంది గిరిజనులు పెద్దగా కేకలు వేస్తూ వాగుల వెంట పరుగులు తీశారు. ఈ ఒక్క ఘటనతో ఇంద్రవెల్లి రక్తసిక్తమైంది. ఈ ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. గిరిజనులతో పాటు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అడవిబిడ్డల్లో దాగిన చీకట్లను తరిమికొట్టేందుకు ఐక్యంగా ఉద్యమించాలనే సంకల్పం ఓ గొప్ప ఉద్యమానికి దారితీసింది. ప్రజల ప్రాణాలు తీసింది. ఇంద్రవెల్లిలో ఓ ఆదివాసీ మహిళతో ఓ పోలీసు అసభ్యంగా ప్రవర్తించడం హింసకు దారి తీసింది. పోలీసులు తుపాకులు, బుల్లెట్లతో ఎదురుదాడి చేయగా, గిరిజనులు కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటన విప్లవకారుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఏప్రిల్ 20వ తేదీ రాగానే చాలామంది ఈ సంఘటన గుర్తొచ్చి భయంతో వణికిపోతున్నారు. కాల్పుల ఘటన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య పిట్టబొంగురం గ్రామాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భూమి, ఇల్లు, ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే మరికొందరు తమకు బుల్లెట్ గాయాలై నేటికి 42ఏళ్ళు గడిచిన ఏ ఒక్కరు ఆదుకోవడంలేదని కాల్పుల్లో గాయపడ్డా ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

కాగా.. కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలోని హీరాపూర్ గ్రామంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అమరవీరులు స్థూపాన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20న గిరిజనులు నివాళులర్పిస్తారు. కానీ 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు డైనమైట్‌తో కూల్చివేశారు. గిరిజనుల నిరాశను తొలగించేందుకు అప్పటి ప్రభుత్వం 1987లో ప్రభుత్వ నిధులతో స్మారక స్తూపాన్ని నిర్మించింది. అయితే స్థూపం వద్దకు గిరిజనులను అనుమతించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏప్రిల్ 18-20 వరకు మూడు రోజుల పాటు ఉట్నూర్ రహదారిని దిగ్బంధించారు. ఈసారి పోలీసులు అలాంటి ఆంక్షలు విధించకుండా స్థూపం పరిసర ప్రాంతాల్లో మాత్రమే 144 సెక్షన్ విధించారు.
Bandi sanjay: నా గురువు కేసీఆర్‌ యే..! ఎందుకంటే?