Telangana Elections 2023 Mobile Phone tension: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఎలాంటి హింసాత్మక ఘటనలు ఏమీ లేకుండా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం 1 గంటకు 36.68 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటనలో తెలిపారు. ఇక జిల్లాల వారీగా చూస్తే కనుక ఇప్పటివరకు అత్యధికంగా గద్వాల్లో 49.29 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా హైద్రాబాద్ నగరంలో 20.79 శాతం మాత్రమే ఓట్లు పోలయినట్టు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ లో ఇంత అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదు కావడానికి ప్రధాన కారణంగా మొబైల్ ఫోన్ నిలవబోతోంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ ఉన్న వారిని ఓటింగ్ కేంద్రం వద్దకు కూడా పోలీసులు అనుమతించడం లేదు. మొబైల్ ఫోన్ లేకపోతేనే ఓటు వేసేందుకు అనుమతి ఇస్తామని పోలీసులు ఖరాఖండిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటు వేయకుండానే వెను తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
Telangana Elections: ఓటు వేసేందుకు ఆవు మీద వచ్చిన ఓటరు
పోలింగ్ బూత్స్ వద్ద ప్రభుత్వం ఎలాంటి లాకర్ ఫెసిలిటీ కూడా కల్పించలేదు, ఫోన్ ఇంట్లో పెట్టి మళ్లీ వచ్చి ఓటు వేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. తమకు ఈ విషయం మీద ముందే కనుక సమాచారం ఇచ్చి ఉంటే మొబైల్ ఫోన్ లేకుండా ఓటింగ్ కేంద్రం వద్దకు వచ్చేవారమని ఇప్పుడు వచ్చి ఓటు వేయకుండా వెనుతిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. అయితే ఈ విషయం ఎన్నికల సంఘం ముందు నుంచే ప్రచారం చేస్తూ వస్తుందని అయినా ఓటర్లు తమతో పాటు ఫోన్ తీసుకురావడం ఇబ్బందికర అంశమేనని పోలీసు అధికారులు చెబుతున్నారు. కనీసం పోలింగ్ కేంద్రాల వద్ద లాకర్ ఫెసిలిటీ అయినా కల్పించి ఉంటే ఈ ఎన్నికల పోలింగ్ లో కొంత ఇబ్బంది తగ్గేదని హైదరాబాదులో ఓటింగ్ శాతం కూడా పెరిగేదని అంటున్నారు విశ్లేషకులు.