Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు

  • అతిథుల మొహమాటానికి చెక్ పెట్టే హోస్ట్ మోడ్
  • లింక్డ్‌ఇన్ పోస్ట్‌తో మొదలైన కొత్త ఆలోచన
  • మెనూ, కార్ట్‌లో ధరలు పూర్తిగా మాయం
  • హోస్ట్ అన్‌లాక్ చేస్తేనే ఫైనల్ బిల్లు కనిపిస్తుంది
Zomato Host Mode

Zomato Host Mode

ఇంట్లో బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా అతిథులుగా వచ్చినప్పుడు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేద్దామని జొమాటో యాప్ వారి చేతికి ఇస్తే.. వాళ్ళు మెనులో ధరలు చూసి కంగారు పడటం, అందరికంటే తక్కువ ధర ఉన్న వంటకాన్ని ఎంచుకోవడం లేదా ‘ఏదో ఒకటి ఆర్డర్ చేయండి’ అని చెప్పడం వంటి అనుభవాలు చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అతిథులు డబ్బుల గురించి ఆలోచించకుండా తమకు నచ్చిన ఫుడ్‌ను స్వేచ్ఛగా ఎంచుకునేలా జొమాటో తాజాగా ‘హోస్ట్ మోడ్’ (Host Mode) అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం భారత్‌వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ సహాయంతో, అతిథులు ఫోన్ తీసుకుని ఫుడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మెనులో ఎలాంటి ధరలు కనిపించవు.

లింక్డ్‌ఇన్‌ పోస్ట్ ఐడియా నుంచి కేవలం 72 గంటల్లోనే..

ఈ ఫీచర్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. కొద్ది రోజుల క్రితం ‘ఇటు చౌదరి డిజైన్’ మార్కెటింగ్ మేనేజర్ ఆయుష్మాన్ అగర్వాలా ‘మెహమాన్ మోడ్’ పేరుతో ఇలాంటి ఫీచర్ ఉండాలని లింక్డ్‌ఇన్‌లో ఒక పోస్ట్ పెడుతూ జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్‌ను ట్యాగ్ చేశారు. దీనికి స్పందించిన దీపిందర్ గోయెల్.. “ఈ వారమే దీన్ని షిప్పింగ్ చేస్తున్నాం” అంటూ రిప్లై ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం 72 గంటల్లోనే ఈ ఫీచర్‌ను లైవ్‌లోకి తెచ్చినట్లు జొమాటో వెల్లడించింది. పండుగల సీజన్ సమయానికి ఇది యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

హోస్ట్ మోడ్ ఎలా పనిచేస్తుంది? దీని ప్రత్యేకత ఏంటి?

భారతీయ కుటుంబాల్లో ఇతరులకు ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఉండే మొహమాటం, సంకోచాన్ని తొలగించడమే ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశం. సాధారణంగా అతిథులు ఖరీదైన బిర్యానీ బదులు చౌకైన స్నాక్స్ ఆర్డర్ చేయడం లేదా మొహమాటంతో సరిగ్గా ఆర్డర్ చేయకపోవడం జరుగుతుంటుంది. అయితే హోస్ట్ మోడ్ ఆక్టివేట్ చేస్తే రెస్టారెంట్ మెనూలోనూ, షాపింగ్ కార్ట్‌లోనూ వంటకాల ధరలు పూర్తిగా మాయమవుతాయి. అతిథులు తమకు నచ్చిన వంటకాలను ఫ్రీగా సెలెక్ట్ చేసుకున్నాక, ఆర్డర్ ప్లేస్ చేసే ముందు హోస్ట్ (ఫోన్ యజమాని) మాత్రమే ఫైనల్ బిల్లును చెక్ చేసుకోవచ్చు.

హోస్ట్ మోడ్‌ను యాక్టివేట్ చేయడం ఎలా?

  • ముందుగా జొమాటో యాప్ ఓపెన్ చేసి హోమ్ స్క్రీన్, రెస్టారెంట్ మెనూ పేజీ లేదా ప్రొఫైల్‌లోని ‘యువర్ ప్రిఫరెన్సెస్’ (Your preferences) ఆప్షన్‌కు వెళ్లాలి.
  • అక్కడ ‘స్విచ్ ఆన్ హోస్ట్ మోడ్’ (Switch on Host Mode) ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • దీంతో మెనూలోని అన్ని ఫుడ్ ధరలు ఆటోమేటిక్‌గా అదృశ్యమవుతాయి.
  • ఇప్పుడు మీ ఫోన్‌ను అతిథులకు ఇచ్చి వారికి నచ్చిన డిషెస్‌ను యాడ్ చేయమనవచ్చు.
  • అందరూ ఎంపిక చేసుకున్న తర్వాత ‘ఎగ్జిట్ హోస్ట్ మోడ్’ (Exit host mode) పై క్లిక్ చేయాలి.
  • మీ ఫింగర్‌ప్రింట్, ఫేస్ అథెంటికేషన్ లేదా పాస్‌వర్డ్ ద్వారా బిల్లును అన్‌లాక్ చేసి మొత్తం అమౌంట్‌ను, డిస్కౌంట్స్‌ను చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు.

అయితే ధరలు కనిపించవు కదా అని అతిథులు మరీ ఖరీదైన వంటకాలు ఎక్కువగా ఆర్డర్ చేసే అవకాశం ఉంది కాబట్టి, ఫైనల్ బిల్లు చెల్లించే ముందు హోస్ట్ ఒక్కసారి టోటల్ అమౌంట్ ఎంత అయిందో చెక్ చేసుకోవడం మంచిది. మొత్తానికి అతిథులు ఎలాంటి టెన్షన్ లేకుండా నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేయడానికి, హోస్ట్ బిల్లు టెన్షన్‌ను ప్రైవేట్‌గా హ్యాండ్ చేయడానికి ఈ ఫీచర్ చక్కగా ఉపయోగపడుతుంది.