NTV Telugu Site icon

Whatsapp: వాట్సాప్‌లో సినిమాలు షేర్ చేసుకోవచ్చు..ఎలా అంటే..

Image

Image

వాట్సాప్‌లో పెద్ద వీడియో ఫైల్స్ షేర్ చేసుకోవడం పెద్ద సమస్య అయిపోతోంది. కేవ‌లం 100 MB లోపు ఫైల్స్‌ను మాత్ర‌మే పంపించుకునే వెసులుబాటు ఉంది. దీంతో చాలామంది యూజ‌ర్లు పెద్ద ఫైల్స్‌ను పంపించేందుకు ఇతర మెసెజింగ్ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. ఈ స‌మ‌స్య‌ను గ‌మ‌నించిన వాట్సాప్ స‌రికొత్త ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2GB వ‌ర‌కు సైజ్ క‌లిగిన ఫైల్స్‌ను పంపించుకునే ఛాన్స్ ఇచ్చింది. అంటే ఓ సినిమా మొత్తం పంపించుకోవచ్చు.

ఈ ఫీచ‌ర్‌ను అర్జెంటీనాలో తీసుకొచ్చి ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రీక్షించింది. తాజాగా ఈ ఫీచ‌ర్‌ను ఇత‌ర ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, IOS యూజ‌ర్లు ఎవ‌రైనా ఈ స‌దుపాయాన్ని వినియోగించుకోవ‌చ్చు. కాక‌పోతే ఇది ఒకేసారి అంద‌రికీ అందుబాటులోకి రాలేదు. ప్ర‌స్తుతానికి కొంత‌మంది యూజ‌ర్లు మాత్ర‌మే ఈ ఫీచ‌ర్‌ను వినియోగించుకునే అవ‌కాశం ఉంది. మిగిలిన యూజ‌ర్ల‌కు త్వ‌ర‌లోనే ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది.

ఈ సదుపాయం మీకు అందుబాటులోకి వచ్చిందో రాలేదో తెలుసుకోవాలంటే మీ వాట్సాప్ ఓపెన్ చేయండి.. ఆ త‌ర్వాత ఏదైనా ఓ కాంటాక్ట్ నంబ‌ర్‌కు 100 MB కంటే ఎక్కువ సైజ్ ఉన్న వీడియోను డాక్యుమెంట్ రూపంలో అటాచ్ చేయండి. అప్పుడు ఆ వీడియో అప్‌లోడ్ అయితే మీకు ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్టే. ఒక‌వేళ అప్‌లోడింగ్ ఫెయిలైతే.. ఈ ఫీచ‌ర్ కోసం మీరు ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అందరికీ ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే వాట్సాప్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.