Site icon NTV Telugu

WhatsAppలో సరి కొత్త ఫీచర్‌.. వెబ్‌లోనే గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్!

Whatsapp Web Group Calls

Whatsapp Web Group Calls

వాట్సాప్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ ఇప్పుడు రానుంది. వాట్సాప్ వెబ్‌లోనే గ్రూప్ వీడియో కాల్స్, గ్రూప్ ఆడియో కాల్స్ చేసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం. ఇప్పటివరకు ఈ సౌకర్యం వాట్సాప్ విండోస్ యాప్ లేదా స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితమై ఉండగా, ఇకపై వెబ్ బ్రౌజర్ నుంచే కాల్స్ చేయవచ్చు. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లు, అప్‌డేట్‌లపై సమాచారం అందించే ప్రముఖ వెబ్‌సైట్ WABetainfo ఈ విషయాన్ని వెల్లడించింది. వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో గ్రూప్ వాయిస్, వీడియో కాలింగ్ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని తెలిపింది. ఇంకా బీటా వెర్షన్‌కూడా విడుదల కాలేదని పేర్కొంది. రాబోయే ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను కూడా WABetainfo షేర్ చేసింది.

Read Also: Davos WEF Summit 2026: దావోస్‌ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు..

ప్రస్తుతం వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ చాట్ ఓపెన్ చేస్తే పైభాగంలో వీడియో కాల్ ఐకాన్ కనిపిస్తోంది. అయితే, దానిపై క్లిక్ చేస్తే “Windows యాప్ ద్వారా గ్రూప్ కాల్స్ చేయండి” అనే సందేశం వస్తోంది. కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే, విండోస్ యాప్ అవసరం లేకుండానే నేరుగా వాట్సాప్ వెబ్ నుంచే గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ చేయగలుగుతారు. ఈ ఫీచర్ అమల్లోకి వస్తే, ఇతరుల ల్యాప్‌టాప్ లేదా పబ్లిక్ కంప్యూటర్ ఉపయోగిస్తున్న సందర్భాల్లోనూ వాట్సాప్ వెబ్ ద్వారా గ్రూప్ కాల్స్‌లో పాల్గొనడం సులభమవుతుంది. ముఖ్యంగా ఆఫీసులు, విద్యా సంస్థల్లో ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

అయితే, ప్రారంభ దశలో వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ కాలింగ్‌కు కొన్ని పరిమితులు ఉండే అవకాశం ఉందని సమాచారం. వీడియో కాల్స్ స్టాండర్డ్ క్వాలిటీనా లేదా హెచ్‌డీకి మద్దతిస్తాయా అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక మరోవైపు, వాట్సాప్ కవర్ ఫోటోల విషయంలోనూ కొత్త గోప్యతా ఫీచర్లను తీసుకొచ్చింది. బీటా వెర్షన్‌లో iOS వినియోగదారుల కోసం కొత్త ప్రైవసీ కంట్రోల్స్ విడుదలయ్యాయి. వీటి ద్వారా తమ కవర్ ఫోటోలను ఎవరు చూడాలో వినియోగదారులే నిర్ణయించుకోవచ్చు. మొత్తంగా, వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ కాలింగ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే, వినియోగదారుల అనుభవం మరింత మెరుగవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version