వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా వాట్సాప్ మరో ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. మనం వాట్సాప్ వాడుతుంటే ఇతరులకు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో మనం ఆన్‌లైన్‌లో ఉన్న సమయంలో ఎదుటివారికి తెలియకూడదని మనం భావిస్తాం. కానీ వాట్సాప్ ఆన్‌లైన్ అని స్టేటస్ చూపించడంతో దొరికిపోతాం. ఈ నేపథ్యంలో వాట్సప్ తమ యూజర్ల కోసం తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌తో మనం ఆన్‌లైన్‌లో ఉన్నా తెలియకుండా హైడింగ్ ఆప్షన్ తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. దీంతో ఫ్యూచర్ అప్‌డేట్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read Also: Taj Mahal : తాజ్ మహల్‌లో హిందు విగ్రహాలు.. క్లారిటీ ఇచ్చిన పురావస్తు శాఖ
వాట్సాప్ బీటా ఇన్ఫో వివరాల ప్రకారం.. సెలక్ట్ చేసిన కాంటాక్టుల ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేయగల సామర్థ్యాన్ని వాట్సాప్ డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ రిలీజ్ అయ్యాక వినియోగదారులు వాట్సాప్ ప్రైవసీ సెట్టింగ్‌లలో ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఎవరు చూడవచ్చో ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. మరోవైపు వాట్సాప్ డిలీట్ ఎవరీ వన్ సమయాన్ని కూడా పెంచేందుకు సిద్ధమవుతోంది. అవతలి వ్యక్తికి పంపిన మెసేజ్‌ను డిలీట్ చేయడానికి ప్రస్తుతం ఉన్న 2 గంటల సమయాన్ని రెండు రోజులకు పెంచేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. ఈ ఆప్షన్ కూడా మరికొద్దిరోజుల్లో యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.